హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ‘ఆపరేషన్ సై స్ట్రైక్’ పేరుతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ సైబర్ ముఠాల గుట్టును రట్టు చేశారు. ఇంటర్పోల్ అధికారుల సహకారంతో అమెరికాకు చెందిన ఎఫ్బీఐతోపాటు యూకే, కువైట్, ఐర్లాండ్, సింగపూర్ దేశాల దర్యాప్తు సంస్థల సమన్వయంతో ‘ఆపరేషన్ సై స్ట్రైక్’ చేపట్టారు. జనవరి 30న దేశవ్యాప్తంగా ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లోని మొత్తం 35 ప్రాం తాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ ఆపరేషన్లో ఒక కీలక సూత్రధారిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఒక సైబర్ నెట్వర్ నుంచి అమెరికా పౌరులను ఆన్లైన్ ద్వారా మోసం చేస్తున్నట్టు గుర్తించారు. వారి వద్ద నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. https://eservicemoi-Kw.com నకిలీ వెబ్సైట్ ద్వారా కువైట్లో ఈ-వీసాలు ఇప్పిస్తామని, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి భారతీయులను మోసం చేస్తున్నట్టు కనుగొన్నారు. ఈ ముఠా నుంచి రూ.60 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యూకే, ఐర్లాండ్, సింగపూర్ దేశాల బాధితులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మరికొన్ని సైబర్ నెట్వర్లను కూడా ఈ ఆపరేషన్లో సీబీఐ ఛేదించింది. సైబర్ నేరాల ద్వారా వచ్చిన నగదు మళ్లించడానికి ఉపయోగించే ‘మ్యూల్ అకౌంట్స్’ను గుర్తించి వాటిని అధికారులు నిలిపివేశారు.