హృద్రోగికి రూ.3 లక్షల ఉచిత వైద్యం
ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యబృందం
ఖమ్మం సిటీ, మార్చి 2: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో క్యాథ్‌ల్యాబ్ ద్వారా చికిత్స విజయవంతమైంది. పేదలకు అత్యాధునిక సేవలందించేందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రూ.7 కోట్ల వ్యయంతో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఇటీవల ఏర్పాటు చేయించిన క్యాథ్‌ల్యాబ్ ద్వారా ఓ రోగికి స్టెంట్ వేసి ప్రాణాలు కాపాడారు. ఖమ్మం నగరంలోని ముస్తాఫానగర్‌కు చెందిన జీ సుధాకర్ ఛాతి నొప్పితో బాధపడుతూ ఫిబ్రవరి 25న జిల్లా కేంద్ర దవాఖానలో చేరారు. హృద్రోగ నిపుణుడు డాక్టర్ సీతారాం.. పేషంట్‌ను పరీక్షించి కరోనరి అంజియోగ్రామ్ చేశారు. స్టెంట్ అవసరమని గుర్తించి చికిత్స చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుధాకర్‌ను కాపాడారు. ఇందుకు ప్రైవేటు దవాఖానలో రూ.3 లక్షలు ఖర్చు అయ్యేదని, మొట్టమొదటిసారిగా క్యాథ్‌ల్యాబ్ ద్వారా ప్రభుత్వ దవాఖానలో పూర్తి ఉచితంగా హృద్రోగ వైద్య సేవలు అందించి రోగి ప్రాణాలను కాపాడినట్టు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. సుధాకర్ ఆరోగ్యం ప్రస్తుతం సాధారణ స్థితికి చేరడంతో డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. క్యాథ్‌ల్యాబ్ ద్వారా విజయవంతంగా చికిత్స అందించిన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, వైద్యులు సీతారాం, సురేశ్‌లను కలెక్టర్ అభినందించారు.