CAT-2025 Results | కోజికోడ్, డిసెంబర్ 24 : జాతీయస్థాయిలో ఐఐఎంలలో ఎంబీఏ ప్రవేశపరీక్ష కోసం ఐఐఎం కోజికోడ్ నిర్వహించిన క్యాట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నిర్వాహకులు బుధవారం క్యాట్ వెబ్సైట్ iimcat.ac.inలో పూర్తి వివరాలను పొందుపరిచారు. 12 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించినట్టు అధికారులు వెల్లడించారు.
వీరిలో ఇద్దరు మహిళలు, 10 మంది పురుషులు ఉన్నట్టు తెలిపారు. ఈ సారి అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఇంజినీరింగ్యేతర విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నట్టు చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన అభ్యర్థులు మెరుగైన ప్రతిభ కనబర్చారని వివరించారు. దేశవ్యాప్తంగా 2.95 లక్షల మంది దరఖాస్తు చేయగా 2.58 మంది పరీక్షకు హాజరయ్యారు.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 నియామకాల్లో అనర్హుల వెయిటేజీ మార్కులను తొలగించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట పలువురు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 నియామకాల్లో 20 మార్కులను వెయిటేజీ కింద ఇవాల్సి ఉందని చెప్పారు.
ల్యాబ్ టెక్నీషియన్లకు మాత్రమే వెయిటేజీ మార్కులు ఇవ్వాల్సి ఉండగా.. కొంత మంది ల్యాబ్ అంటెండర్లు, మలేరియా సూపర్వైజర్లు, డయాగ్నొస్టిక్ హబ్ మేనేజర్లు, కాలేజీ ట్యూటర్లు మొదలైన వారు సర్వీసు వెయిటేజీ పొందినట్టు ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని మరోసారి వెయిటేజీ మార్కులను, సర్టిఫికెట్లను పరిశీలించాలని, అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.