హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 25న రవీంద్రభారతి వేదికగా బీసీల సమరభేరి సదస్సు నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకేరోజులో బిల్లు పెట్టి ఆగమేఘాలపై 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన బీజేపీ సర్కారు.. బీసీలు ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బీసీల కోసం కేంద్రస్థాయిలో ఒక పథకాన్ని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. చట్టసభల్లో, ఉద్యోగ ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, క్రీమీలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమరభేరి సదస్సుకు బీసీలు, కులసంఘాల ప్రతినిధులు భారీగా తరలిరావాలని కోరారు.