హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో ఈ పథకం అమలుపై బుధవారం ఆయన రాష్ట్ర రవాణా, పోలీస్, ఆరోగ్య, ఇన్సూరెన్స్, ఎన్ఐసీ అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బీమాతో సంబంధం లేకుండా రోడ్డు ప్రమాదాల బాధితులకు ప్రమాదం జరిగిన తొలి 7 రోజులు రూ.1.5 లక్షల నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఈ పథకం విజయవంతం కావడానికి రవా ణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్ , ఎన్ఐసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బాధితులకు వెంటనే చికిత్స అందేలా మరిన్ని ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.