రుణమాఫీ అయిపోయిందంటూ ఆర్భాటంగా ప్రకటించి, సవాళ్లు విసిరి, ముఖ్యమంత్రి అడ్డగోలు భాషలో మాట్లాడి నాలుగు రోజులైనా కాకముందే మంత్రులు నాలుక మడతేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రగిలిపోతున్న రైతన్నలు ఊరూరా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే, ఆ వేడికి మంత్రుల నోట అసలు మాట బయటకు వస్తున్నది. వడ్డీ, అదనపు రుణం కడితేనే మిగతావి మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల మొన్నటికి మొన్న వ్యాఖ్యానించగా, మరో 12 వేల కోట్లు ఇస్తామంటూ మంత్రి పొంగులేటి చెప్పారు.
ఇక నిన్నటికి నిన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసలు సంగతి బయటపెట్టారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా కాలేదని, దాదాపు 9 లక్షల మందికి డబ్బు చెల్లింపు జరగలేదని ఉత్తమ్ చెప్పగా, సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీలో సమస్యలు తలెత్తినట్టు మంత్రి జూపల్లి అంగీకరించారు. మరి రుణమాఫీ అయిపోయిందన్న ముఖ్యమంత్రి కరెక్టా? కాలేదని అంగీకరిస్తున్న మంత్రులు కరెక్టా? రుణమాఫీ జరగలేదనడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేస్తున్న ధర్నాలే నిదర్శనం.
అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తున్న ప్రభుత్వం, పోలీసు బలగాలతో రైతులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నది. వారు బయటకు రాకుండా, దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు చేయకుండా అడ్డుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలిసింది. అంతేకాదు; ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించిన 11 మంది రైతులపై ఏకంగా కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్/ఆదిలాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ పూర్తి చేశామంటూ శుద్ధ అబద్ధాలు చెప్తున్న ప్రభుత్వం.. తమకు మాఫీ కాలేదని రైతులు నెత్తీనోరు బాదుకొని అరిచినా పట్టించుకోవడం లేదు. పైగా.. అన్నదాతలు గొంతెత్తకుండా పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం చేసిన మోసంతో ఆగ్రహం కట్టలు తెంచుకొని, రోడ్డెక్కిన రైతులపై నిర్దాక్షిణ్యంగా పోలీసు కేసులు పెడుతున్నది. బాధిత రైతుల గోడు వినాల్సిన ప్రభుత్వం వారి గొంతు నొక్కుతున్నది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే రెండు రోజుల్లో 15 మంది రైతులపై కేసులు నమోదు చేసింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి హెచ్చరికలు పంపుతున్నది. దీంతో ‘మా హామీ మా ఇష్టం.. మేం చేసిందే రుణమాఫీ.. ప్రశ్నిస్తే కటకటాల వెనక్కే’ అన్నట్టుగా పరిస్థితి తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఆదివారం రైతులు రోడ్డెక్కడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో రైతులు ధర్నాలు చేయకుండా కట్టుదిట్టం చేయాలని పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొత్తంగా రైతులు గొంతెత్తకుండా ఉక్కుపాదం మోపాలని విశ్వప్రయత్నం చేస్తున్నది.
తమకు రుణమాఫీ కాలేదంటూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వారిని అదుపు చేసేందుకు ప్రభుత్వం పోలీసు కేసులు పెడుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ చేయాలంటూ నిరసన తెలిపినందుకు రెండు రోజుల్లో 15 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో రైతులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. దీంతో పోలీసుల 11 మంది రైతులపై కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన నిమ్మల సుదర్శన్‌రెడ్డి, పుండ్రూ పోతారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, కుమ్మరి భూమన్న, విపుల్రెడ్డి, సూర్యసేన్రెడ్డి, గోక లక్ష్మారెడ్డి, నక్క ధనుంజయ్, దత్తు, సతీశ్‌రెడ్డి, నర్సింహులపై కేసు నమోదు చేశారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు అదుపులోకి తీసుకొని రాత్రి 10.30 గంటల వరకు పోలిస్స్టేషన్లో నిర్బంధించారని బాధితులు వాపోతున్నారు. తమపై ఎవరు ఫిర్యాదు చేశారని అడిగినా చెప్పలేదని పేర్కొన్నారు. జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30 అమల్లో ఉన్నదని అధికారులు చెప్తున్నారు. నిబంధనలు ఉల్లంఘనతోపాటు పోలీసుల విధులకు ఆటంకం, సీఎం హోదాలో ఉన్న వారిని అవమానపర్చేలా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్టు అధికారులు చెప్తున్నారట. ఈ ఘటనపై సోమవారం రుయ్యాడి రైతు వేదికలో రైతులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అన్నదాతలపై ప్రభుత్వం కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రుణమాఫీ అడిగితే కేసులు పెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కొనసాగింపుగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో మరో నలుగురు రైతులపై కేసు నమోదుచేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినందు కు రైతులు డబ్బుల చంద్రశేఖర్,అలికె గణేశ్, తురాటి భోజన్న, చెట్ల వినీల్పై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై అప్పారావు తెలిపారు. ఒక్క ఆదిలాబాద్‌లో మాత్రమే కాదని, ఇతర అన్ని జిల్లాల్లోనూ రైతులు రోడ్డెక్కితే కేసులు పెట్టాలని పోలీసులు నిర్ణయించినట్టు చెప్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసనలపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాలు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల సమక్షంలోనే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న ఫొటోలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, తదితర ఉన్నతాధికారులతో మాట్లాడారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కండ్ల ముందే దిష్టిబొమ్మలను తగలబెడుతుంటే ఏం చేస్తున్నట్టు? అని సీఎం ప్రశ్నించినట్టు సమాచారం. ఈ వ్యవహారంతో ప్రభుత్వం పరువు పోయిందని,రుణమాఫీ బూడిదలో పోసిన పన్నీరైందని అసహనం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రైతుల నిరసనలను కట్టుదిట్టం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. పోలీ సు ఉన్నతాధికారులు ఆదిలాబాద్ జిల్లా ఉన్నతాధికారులతో మాటాడినట్టు తెలిసింది.దీంతోపాటు ఆయా జిల్లాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రైతులు రోడ్డెక్కకుండా చూసుకోవాలని మౌఖికంగా ఆదేశించినట్టు తెలుస్తున్నది. ఎవరైనా రైతులు, నేతలు అనుమతులు కోరినా ఇవ్వవద్దని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. నియంత్రణకు ఇంటెలిజెన్స్‌ను వాడాలని, ఎక్కడైనా రైతులు ఆందోళనకు దిగే పరిస్థితులు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్థాయి అధికారులకు చెప్పాలని సూచించినట్టు సమాచారం. ఎక్కడైనా నిరసన చేసే పరిస్థితులు ఉంటే.. పోలీసులు వెంటనే వెళ్లి ‘ఏదో ఒక రకంగా’ రైతులను ఒప్పించి, రోడ్డెక్కకుండా చూడాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
మా గ్రామంలో 80 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మా గోసను ప్రభుత్వం అర్థం చేసుకోక కేసులు బనాయిస్తున్నది. గ్రామంలో రైతులందరం కలిసి పోలీసు కేసులను ఎదుర్కొంటాం. రైతుల ఆందోళనలు రాజకీయ పార్టీలకు ముడిపెట్టడం సరికాదు. శవయాత్రలో పాల్గొన్న వారు నిజమైన రైతులో కాదో ప్రభుత్వం నిర్ధారించుకోవాలి.
షరతులు లేని రుణమాఫీ చేస్తామన్నారు. ఇదే విషయాన్ని నిరసన ప్రదర్శన ద్వారా అడిగాం. నేను ఉన్నత విద్యాభ్యాసం చేసినా ఉద్యోగాలు లేక వ్యవసాయం చేస్తున్నా. ధర్నాను వక్రీకరించి రాజకీయ ఒత్తిళ్లతో ఓ మంత్రి ద్వారా రైతులపై కేసులు బనాయించారు. రైతులకు అన్యాయం జరిగితే ఎవరూ ప్రశ్నించవద్దన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగినందుకు ప్రభుత్వం పోలీసు కేసులు బనాయిస్తున్నది. రైతుగా పుట్టడం మేము చేసుకున్న తప్పా. రుణమాఫీ చేయమని అడిగే హక్కు రైతులకు లేదా? రాజకీయ ఒత్తిళ్లతో మాపై కేసులు బనాయించారు. తమపై ఎవరు ఫిర్యాదు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగితే పోలీసులు సమాధానం చెప్పకుండా ఐదు గంటలకు పైగా నిర్బంధించారు.
వినాయక్‌నగర్, ఆగస్టు 19: నిజామాబాద్ లో ఓ మిఠాయి దుకాణం యజమాని పోలీసుల వేధింపులపై వినూత్నంగా నిరసన తెలిపారు. తన దుకాణం ఎదుట ‘షాప్ ఈజ్ క్లోజ్డ్ డ్యూ టూ పోలీస్ హరాస్మెంట్’ అనే ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆదివారం ఫ్లెక్సీ ఏర్పాటుచేసి దుకాణం మూసి ఉండడంతో వినియోగదారులు విస్మయానికి గురయ్యారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జవహర్రోడ్డులో ఉన్న ఢిల్లీవాలా స్వీట్హోంకు వచ్చే వినియోగదారులు వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కాకూడదని పోలీసులు తెలుపడంతో షాపు నిర్వాహకులు పోలీసుల వేధింపుల కారణంగానే షాపును మూసివేస్తున్నట్టు ఆదివారం పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. దుకాణ యజమాని తప్పుడు ప్రచా రం చేస్తున్నారని పోలీసులు సోమవారం కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు.