హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ ) : సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నిరుడు డిసెంబర్లో బాధితులు ఫిర్యాదు చేశారు. లాభాల ఆశ చూపి కస్టమర్ల నుంచి దాదాపు రూ.1.55 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బై బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో దాదాపు రూ.కోటిన్నర మేర వసూలు చేసి ఏడాదిన్నర తర్వాత 25% అధికంగా చెల్లిస్తామని శ్రీధర్ చెప్పినట్టు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్కీమ్ కాలవ్యవధి దాటినా డబ్బులు చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. పెట్టుబడి పేరుతో తమను మోసగించారంటూ సాఫ్ట్వేర్, రిటైర్డ్ ఉద్యోగులు శ్రీధర్‌పై ఫిర్యాదు చేశారు. మోసాల చిట్టా పెద్దగా ఉండటంతో ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు సీసీఎస్‌కు వచ్చివెళ్లినట్టు తెలిసింది. ఈ కేసులో సుమారు 200 మంది కస్టమర్లు ఉంటారని, రూ.200 కోట్ల మేర మోసం జరిగినట్టు పోలీసులకు చెప్పారు.