హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్టు సోషల్ మీడియాలో వీడియో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్ కారు డ్రైవర్ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి.
అలాగే మాజీ సీఎం జగన్, కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు షేర్నీ నాని, రజినిలపై కేసు నమోదు చేయగా, ఏ1గా డ్రైవర్, ఏ2గా జగన్ను కేసులో చేర్చినట్టు తెలిసింది. జగన్ పర్యటనలో ప్రమాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని వైసీపీ ‘ఎక్స్’ వేదికగా ఆరోపించింది. టీడీపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రమాదాన్ని వాడుకుంటున్నదని మండిపడింది.