హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీసుల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగానే మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. హరీశ్‌రావుపై కేసు విషయంలో డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ మోహన్కుమార్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు డీజీపీ జితేందర్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. రేవంత్‌రెడ్డి చట్టవ్యతిరేక చర్యలకు భయపడే ప్రసక్తేలేదని మీడియాతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. డీజేపీని కలిసిన వారిలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీవ్‌సాగర్, పల్లె రవికుమార్, బీఆర్ఎస్ లీగల్‌సెల్ ప్రతినిధులు కల్యాణ్‌రావు, లలితారెడ్డి ఉన్నారు.
కేసులతో అణవిచివేసే కుట్రలు
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొకుతున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. కొందరు పోలీసులను సీఎం రేవంత్‌రెడ్డి పాలేగాళ్ల లాగా మార్చుకున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి అణిచివేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన హరీశ్‌రావుపై ఒక క్రిమినల్ రికార్డున్న వ్యక్తిని శిఖండిలా అడ్డుపెట్టుకుని ఫిర్యాదు చేయించి, అరెస్టు చేయించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నాయకులపై కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగానే హరీశ్‌రావుపై కేసు పెట్టారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. చక్రధర్‌గౌడ్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో హరీశ్‌రావును సతాయించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్యలను బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.
ఎన్ని కేసులు పెట్టినా బెదరం
కాంగ్రెస్ ఏడాది పాలనను చీల్చిచెండాడుతున్నందుకే కేటీఆర్, హరీశ్‌రావును నిర్బంధించాలని సీఎం రేవంత్‌రెడ్డి భ్రమల్లో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజమెత్తారు. ఎందరు నేతలపై కేసులు పెట్టినా అదరం బెదరమని చెప్పారు.
నన్ను బతకనియ్యబోమని బెదిరించారు! ;డీజీపీ జితేందర్‌కు ‘ఫోన్ ట్యాపింగ్’ బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి తనను అకారణంగా చిత్రహింసలు పెట్టారని కేసులో అరెస్టయిన వంశీకృష్ణ డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వంశీకృష్ణ తన లాయర్ ద్వారా ఫిర్యాదును పంపించారు. తీవ్రంగా హింసించిన డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ మోహన్కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. తనపై విచారణలో మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు చెప్పాలంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టు డీజీపీకి సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి చాలా ఇబ్బందులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఈ మేరకు స్పందించిన డీజీపీ విచారణ చేపట్టి.. తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని లాయర్ వెల్లడించారు.