MLA Danam Nagender | హైదరాబాద్ (వెంగళరావునగర్), ఆగస్టు 12: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 10న ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ డివిజన్లోని నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్‌కు చేరుకుని ఆక్రమణదారులను రెచ్చగొట్టారని, ఎమ్మెల్యే సమక్షంలోనే ఆక్రమణదారులు పార్కు గోడను కూల్చి వేసినట్టు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు..ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు దానంతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.
అంతరించిపోతున్న ఏనుగు: మంత్రి సురేఖ
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): భూమిపై జీవించే హక్కు సకలజీవులకు ఉన్నదని మంత్రి సురేఖ చెప్పారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురసరించుకుని సోమవారం బెంగుళూరులో నిర్వహించిన ఓ సదస్సులో ఆమె మాట్లాడారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఏనుగులు ఉండటం బాధాకరమన్నారు.ఏనుగులను కాపాడుకోవడానికి అందరం కృషి చేయాలని కోరారు.
‘దేవాదుల’కు 45 కోట్లు
హైదరాబాద్, ఆగస్టు12 (నమస్తే తెలంగాణ): దేవాదుల ఎత్తిపోత పథకం నిర్వహణకు ప్రభుత్వం రూ.45 కోట్లకు పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. రెండేండ్లపాటు దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 1 సిస్టమ్ ఆపరేషన్ నిర్వహణకు ఈ అనుమతిని ఇచ్చింది.
నాయబ్ తాసిల్దార్ల సీనియార్టీ జాబితా ఇవ్వండి
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): నాయబ్ తాసిల్దార్ల సీనియార్టీ జాబితా రూపొందించాలని రెవెన్యూ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఉమ్మడి జిల్లాల వారీగా, మల్టీ జోన్ల వారీగా జాబితాలను రూపొందించాలని సీసీఎల్ఏ నవీన్‌మిట్టల్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు.
మందుపాతర పేలి ఆదివాసీ మహిళ మృతి
కొత్తగూడెం క్రైం, ఆగస్టు 12: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ మహిళ మృతిచెందింది.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్కకు చెందిన ఆదివాసీ మహిళ కవాసి సుక్కీ సోమవా రం మేకలు కాసేందుకు అడవికి వెళ్లింది. మందుపాతరపై కాలు మోపడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.