హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనతోపాటు రాష్ట్రంలో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. దేవరకొండ సంఘటనతోపాటు ఇతర హాస్టళ్లలో ఇలాంటి పరిస్థితులపై వచ్చిన వార్తా కథనాలపై కమిషన్ స్పందిస్తూ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగస్టు 28లోగా సమగ్రమైన నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
బాధిత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, విచారణ ఫలితాలు, నిర్లక్ష్యం వ హించిన సిబ్బందిపై తీసుకున్న చర్యలు, అన్ని హాస్టళ్లలో ఆహార భద్రతను గురించి తీసుకుంటున్న చర్యలు, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని, అన్ని అంశాలను అందులో పొందుపర్చాలని కోరింది. దేవరకొండ ఎస్టీ గురుకుల బాలికల హాస్టల్లో కల్తీ ఆహారం తిని 30మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో దవాఖానల్లో చేరారు. దీంతో మానవ హకుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఈ అంశంపై ఫిర్యాదు చేయడంతో 701/IN/2025 కింద ఎస్హెచ్ఆర్సీ పరిగణనలోకి తీసుకున్నది. అనంతరం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకున్నట్టు ప్రకటించింది.
సమగ్ర విచారణ చేపట్టాలి: న్యాయవాది రామారావు
ముదిగొండలోని ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని తన ఫిర్యాదులో కోరారు. తన ఫిర్యాదులో ఆయన నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠిని ప్రతివాదిగా పేరొన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఫుడ్ కాంట్రాక్టర్ను సస్పెండ్ చేయాలని, ని ర్లక్ష్యం వహించిన అధికారులను వెంటనే తొలగించాలని కోరారు.