హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే తనపై లైంగిక దాడి చేయడంతో పాటు ఐదుసార్లు అబార్షన్ చేయించారని ఓ మహిళ ఆరోపించింది. 2024లో అరవ శ్రీధర్‌కు ఓ అంశమై ఫేస్ బుక్ ద్వారా అభినందనలు చెప్పినట్టు మహిళ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో మాట్లాడుదామంటూ తన వివరాలతో పాటు ఫోన్ నంబర్ తీసుకున్నట్టు వెల్లడించారు.
భర్తకు దూరంగా ఉంటున్న తనను బెదిరించి జూలై 9న కారులో లైంగికదాడి చేశారని ఆరోపించింది. ఇదే విషయమై మహిళ బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కొట్టి, తిట్టి ఎమ్మెల్యే లోబర్చుకున్నట్టు ఫిర్యాదులో పొందుపర్చారు. పెండ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని పేర్కొన్నది
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై లైంగికదాడి ఆరోపణల నేపథ్యం లో జనసేన పార్టీ విచారణకు కమిటీ వేసింది. ముగ్గురు సభ్యులతో వేసిన ఈ కమిటీలో టీ శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీ సీ వరుణ్ ఉన్నారు. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక ఇచ్చే వరకు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.