హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): స్థానికేతరులై ఉంటూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేసినందుకు ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ, ఓటర్లను ప్రభావితం చేస్తూ, కాంగ్రెస్‌కు ఓటు వేయాలని బహిరంగంగా ప్రచారం చేస్తూ కోడ్ ఉల్లంఘించినట్టు బీఆర్ఎస్ వారిపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం అందజేసింది.
ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్ నాయక్‌లపై మధురానగర్‌లో రెండు కేసులు నమోదు చేయగా, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, మెతుకు ఆనంద్‌లపై బోరబండ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఇంకా చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రధాన పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించి ఓటర్లను ప్రభావితం చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా చోట్ల పోలీసులు వీరిని చూసీచూడనట్టు వదిలేశారు. సెయింట్ ఆల్ఫోన్సా హైస్కూల్లో ఏర్పాటుచేసిన పోలింగ్‌బూత్ నంబర్ 121 పక్కన ఉన్న ఓ ఇంట్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి వైరా ఎమ్మెల్యే రామ్‌దాస్‌నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. సిద్దార్థ్నగర్ ఏరియాలోని పోలింగ్‌బూత్ వద్ద ఓ ఓటరుతో మాట్లాడటం కనిపించింది.