ఆదిబట్ల, ఏప్రిల్ 19 : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌రెడ్డి, మరో వ్యక్తి చామరి మారుతి రవిశంకర్ తన ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు వారిపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్ల పల్లి మండలం పెర్వాల్కు చెందిన కే రాధిక, తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడలో సర్వే నంబర్ 500, 501, ప్లాట్ నంబర్ 65లో 200 గజాల స్థలాన్ని ఏజీపీఏ హోల్డర్ వంగల రవీందర్‌రెడ్డి నుంచి 2015లో కొనుగోలు చేసింది.
స్థలం చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేసుకొని తమ ఆధీనంలో ఉంచుకోగా ప్రస్తుత భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చామరి మారుతి రవిశంకర్ కలిసి 200 గజాల ఇంటి స్థలంతో పాటు ప్లాట్లకు వెళ్లే దారిని సైతం కబ్జా చేశారని ఈ నెల 13న రాధిక ఇబ్రహీంపట్నంలోని 15వ అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు వెంటనే కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.