హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): భూభారతి అక్రమాలకు సంబంధించి నిధులు కొల్లగొట్టిన 48 మందిపై కేసు నమోదు చేసినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూభారతి అక్రమాలపై విచారణ చేపట్టిన ఉన్నతస్థాయి కమిటీ తన నివేదికను శనివారం మంత్రికి అం దజేసింది. కమిటీ అధికారులు సచివాలయంలో మంత్రి పొంగులేటితో భేటీ అయ్యారు. విచారణలో 9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలు జరిగినట్టు తేలిందని, ఇందు కు కారణమైన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు అధికారులు మంత్రికి వివరించారు. పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 35వేల లావాదేవీలు జరిగాయని, ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు వెల్లడించారు. విచారణ తర్వాత 1,109 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.4 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిధులు పక్కదారి పట్టినట్టు కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. భూభారతి పోర్టల్ అక్రమాల్లో ఎవరి పాత్ర ఎంత? తెర వెనుక ఎవరైనా ఉన్నా రా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వంటి అంశాలపై కమిటీ సభ్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆ దిశగా విచారణ చేసి తుది నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు.