దుండిగల్, జనవరి 17: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాలేజీలో ర్యాగింగ్, తోటి విద్యార్థులపై దాడులు చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో అతడి రౌడీయిజం బట్టబయలైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొన్న కళాశాల యాజమాన్యం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహీంద్ర యూనివర్సిటీ స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ సుఖేశ్ ఫిర్యాదు మేరకు 341, 323, 504,506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరశివారు బహదూర్‌పల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో (టెక్ మహీంద్ర) బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ బీటెక్ చదువుతున్నాడు. కాలేజీ క్యాంపస్‌లో తోటి విద్యార్థిని దుర్భాషలాడుతూ భౌతికదాడికి పాల్పడ్డాడు. భగీరథ్‌కు మద్దతుగా బాధితుడిని మరో విద్యార్థి కూడా చితకబాదాడు. దాడి వీడియో దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. బండి సంజయ్ కొడుకు విద్యార్థి దశలోనే రౌడీలా తోటి విద్యార్థిపై దాడి చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో తనకు ఎదురులేదనే భావనతో తోటి విద్యార్థులను చితకబాదడం భగీరథ్ అలవాటుగా మార్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో విరుచుకుపడ్డ నెటిజన్లు
మహీంద్ర వర్సిటీలో తోటి విద్యార్థిపై దాడిచేసిన బండి సాయి భగీరథ్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ పేరును ప్రస్తావిస్తూ.. ఇదెక్కడి రౌడీయిజం అని నిలదీశారు. తండ్రి సంజయ్ మత విద్వేషాల స్టార్.. కొడుకు ర్యాగింగ్ స్టార్ అంటూ చురకలు అంటించారు. దీనిపై గవర్నర్ వెంటనే స్పందించాలని కోరారు. ‘వేకప్ తమిళిసై’ అంటూ ట్యాగ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో చిన్న చిన్న ఘటనలపై స్పందించిన గవర్నర్ తాజా వీడియోపైనా స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.