MLA Kaushik Reddy | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం హైడ్రామా నడిచింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చేందుకు మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్ పోలీ స్ స్టేషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెళ్లగా 2.55 గంటలకే ఏసీపీ వెంకట్‌రెడ్డి పీఎ స్ నుంచి వెళ్లిపోయారు. ఏసీపీ సూచన మేరకు సీఐకి ఫిర్యాదు ఇద్దామని వెళ్తుండగా వారి రాకను చూసి సీఐ రాఘవేంద్ర డ్యూటీ పేరుతో బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుకొని ఫిర్యాదు తీసుకోవాలని పట్టుబట్టడంతో స్టేషన్లోకి వెళ్లి కౌశిక్‌రెడ్డి ఫిర్యాదును స్వీకరించి రసీదు ఇచ్చారు. అనంతరం తన విధులకు అటంకం కలిగించారన్న అభియోగంతో సీఐ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ వెల్లడించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమను పట్టించుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేసి చివరికి విధులను అడ్డుకున్నారన్న కారణంతో తమ ఎమ్మెల్యేపైనే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చేందుకు మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వెళ్లగా 2.55 గంటలకే ఏసీపీ వెంకట్‌రెడ్డి పీఎస్ నుంచి వెళ్లిపోయారు. ఈక్రమంలో ఏసీపీ ఆఫీసులోకి వెళ్లి వెంకట్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడగా ‘నాకు అర్జెంట్ డ్యూటీ ఉన్నది. వచ్చేందుకు అరగంట పైనే పడుతుంది. ఫిర్యాదు కాపీని సీఐకి ఇవ్వండి’ అని చెప్పారు. దీంతో ఏసీపీ కార్యాలయం నుంచి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు వస్తుండటాన్ని గమనించి సీఐ రాఘవేంద్ర డ్యూటీ పేరుతో బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు.
తన వాహనాన్ని పోలీస్‌స్టేషన్ గేటు వద్దకు తీసుకెళ్లగా బీఆర్ఎస్ శ్రేణులు కారుతోపాటు వచ్చి సీఐని రిక్వెస్ట్ చేశారు. ‘ఏసీపీ గారు మిమ్మల్ని ఫిర్యాదు తీసుకొమ్మన్నారు’ అని చెప్పగా ‘లేదు నాకు డ్యూటీ ఉన్నది. వెళ్తున్న కాసేపు వెయిట్ చేయండి. లేదంటే ఎస్ఐకి ఫిర్యాదు ఇవ్వండి’ అంటూ వాహనంలో హడావుడిగా వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులు ‘కచ్చితంగా ఫిర్యాదు తీసుకోవల్సిందే’నని పట్టుబట్టారు. అక్కడికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వచ్చి ‘ఎమ్మెల్యే వస్తే కనీసం ప్రొటోకాల్ పాటించరా? ఇదేనా మర్యాదా? కనీసం పిటిషన్ తీసుకోండి’ అంటూ రిక్వెస్ట్ చేశారు. అయినా సీఐ రాఘవేంద్ర వాహనం దిగకుండా డ్యూటీ ఉందని చెప్పి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
అప్పటికే సీఐ వెళ్తుండటాన్ని మీడియా వీడియోలో తీయడంతో చేసేది లేక ఆయన వాహనం దిగి స్టేషన్లోకి వెళ్లారు. అనంతరం పాడి కౌశిక్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదును స్వీకరించి రశీదు ఇచ్చారు. పోలీసు స్టేషన్లోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ ఉంటుందని, దాన్ని పట్టించుకోకుండా తాము ఫిర్యాదు చేసేందుకు వస్తే ఎలా బయటకు వెళ్లిపోతారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి పదవి లేని సీఎం సోదరులకు పోలీసులు వంగివంగి దండాలు పెడుతున్నారని, ఎమ్మెల్యే వస్తే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
తన ఫోన్‌ను కొంతకాలంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి ట్యాప్ చేస్తున్నారని, తనను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తగు చర్యలు తీసుకోవాలని, వెంటనే కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, ముఠా జైసింహ, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, కురవ విజయ్‌కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కరాటేరాజు డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ను అడ్డుకున్నందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఎమర్జెన్సీ డ్యూటీపై పీఎస్ నుంచి వెళ్తున్న సీఐని కౌశిక్‌రెడ్డి తన అనుచరులు అడ్డుకున్నారని, పీఎస్‌లోని అడ్మిన్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు ఇవ్వొచ్చని చెప్పినా వినకుండా సీఐ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని, తాను తిరిగి వచ్చేదాకా వేచి ఉండాలని చెప్పినా వినలేదని డీసీపీ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేసి కౌశిక్‌రెడ్డి, ఆయన అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఎస్‌లో ఫిర్యాదు చేయాలనుకునేవారు రిసెప్షన్లో సమర్పించి రసీదు పొందవచ్చని తెలిపారు. అంతేకానీ విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరించడం, అడ్డుకోవడం శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమేనని చెప్పారు.