హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీవోలకు కారు అలవెన్స్ అందడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీడీవోలకు ఠంచన్‌గా కారు అలవెన్స్ బిల్లులు చెల్లించగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఆ అలవెన్స్ రెన్యువల్ ప్రక్రియను పూర్తిచేయలేదు. ఎంపీడీవోల కారు అలవెన్స్ రెన్యువల్, బిల్లుల ఫైల్ ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు ఉన్నతాధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 570 మంది ఎంపీడీవోలు ఉన్నారు. వీరిలో సుమారు 200 మంది మహిళా అధికారులు ఉన్నారు. వీరంతా తమ సిబ్బందితో కలిసి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం తదితర పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎంపీడీవోలకు గత ప్రభుత్వాలు అద్దె ప్రాతిపదికన వాహన సౌకర్యం కల్పించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2023 మార్చి వరకు మొత్తం బిల్లులను చెల్లించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా ఒక్కసారి కూడా ఎంపీడీవోల వాహన అలవెన్స్ బిల్లులను విడుదల చేయలేదు. ఎంపీడీవోల వాహన అలవెన్స్ ప్రక్రియను ఉన్నతాధికారులు ఏటా రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన ఫైల్‌ను ఆర్థికశాఖకు పంపినప్పటికీ అక్కడే పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. వాహన కిరాయి కింద ఒక్కో ఎంపీడీవోకు ప్రతినెల రూ.32,300 చొప్పున నెలకు రూ.1.84 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. అలా 20 నెలలకు కలిపి సుమారు రూ.46 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి నేటివరకు వాహన కిరాయి కింద ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని, దీంతో తమ వేతనం నుంచి వాహన బిల్లులు చెల్లిస్తున్నామని ఓ ఎంపీడీవో ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీడీవోలు కలెక్టర్ల నుంచి అడ్వాన్స్‌గా కొంత మొత్తం తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వాహన అలవెన్స్ బిల్లులు విడుదల చేయాలని తెలంగాణ ఎంపీడీవోల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎంపీడీవోల వాహన అలవెన్స్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నమాట నిజమేనని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన తెలిపారు. వాహన కిరాయి అలవెన్స్ ప్రక్రియను ఏటా రెన్యువల్ చేయాల్సి ఉండటంతో సంబంధిత ఫైల్‌ను ఆర్థికశాఖకు పంపామని, పది రోజుల్లో ఆ ఫైల్ క్లియర్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో మొత్తం ఎంపీడీవోలు 570 మంది
ఒక్కో ఎంపీడీవోకి రావాల్సిన నెలవారీ వాహన కిరాయి రూ.32,300
ప్రతినెల ప్రభుత్వం ఇవ్వాల్సింది రూ.1.84 కోట్లు
ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు రూ.46 కోట్లు