చిన్నకోడూరు, అక్టోబర్ 19: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బూతులు, తిట్లపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్‌లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆదివారం మొకజొన్నను పరిశీలించారు. అనంతరం రైతుతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు ఇప్పటికే నష్టపోయారని, ప్రభుత్వం పత్తిని కొనగోలు చేయకపోవడంతో మరింత నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.8,100 ధర ఉన్న పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు రూ. 5,900కు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఫలితంగా రైతులు క్వింటాలుకు రూ. 2 వేల చొప్పున నష్టపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పంటలు కొనాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని హరీశ్‌రావు తెలిపారు. మార్కెట్లో మక్కలు పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉందని దుయ్యబట్టారు. ఇప్పటికే 30 నుంచి 40 శాతం వరకు రైతులు దళారులకు పంటను అమ్ముకున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎకరానికి రైతులు రూ. 10 వేలు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం తప్ప రేవంత్‌రెడ్డికి రైతులంటే పట్టింపులేదని మండిపడ్డారు. రెండు రైతుబంధులు ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డిని రైతులు క్షమించరని హెచ్చరించారు. రుణమాఫీ సగమే చేశారని, కౌలు రైతుకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చామని, రేవంత్ ప్రభుత్వం మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఇస్తున్నదని తెలిపారు.
పొలాల వద్ద సద్ది తింటున్న రైతుల వద్దకు వెళ్లి హరీశ్‌రావు ఆత్మీయంగా ముచ్చటించారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో మధ్యా హ్నం సమయంలో రైతులు పనులు ముగించుకొని సద్ది తినేందుకు వెళ్తుండగా హరీశ్‌రావు వారిని చూసి అకడికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సద్ది తింటున్న మహిళా రైతులతో పాటు నేలపై కూర్చొని రైతులతో మాట్లాడారు. సన్నబియ్యంతో అన్నం ముద్ద అవుతున్నదని, మంచిగా ఉండలేదని రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ నిర్మించడం వల్లే సాగునీళ్ల బాధ తొలగిందని రైతులు చెప్పారు. మూడు పంటలు పండిసున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్లవల్లే సార్ అని తెలిపారు.
వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వ డం లేదని చెప్పారు. మిర్చి పంట వేయక ముం దు తాము గుడిసెల్లో ఉండేవాళ్లమని, వేశాక మీ దయతో భవనాలు నిర్మించుకున్నామని రైతులు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందంగౌడ్, ఉమ్మడి జిల్లా గొర్ల పెంపకందార్ల మాజీ అధ్యక్షుడు శ్రీహరియాదవ్, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, ఆయా మండలాల మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.