హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): జువైనల్ జస్టిస్ బోర్డు, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డుల్లో చైర్పర్సన్, నలుగురి చొప్పున సభ్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం పరీక్ష నిర్వహణపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. గడువు ముగిసి 20 రోజులు దాటినా అధికారవర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో పరీక్ష ఆలస్యమవుతుందేమోనని మథనపడుతున్నారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని జువైనల్, డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ బోర్డుల్లో చైర్పర్సన్, సభ్యుల నియామకానికి మహిళా శిశు సంక్షేమ శాఖ 22 జూలై 2025న నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో బోర్డులో మహిళ, పిల్లల నిపుణుడు ఒక్కొక్కరీ చొప్పున తప్పక ఉండాలని నిర్దేశించింది. ఆగస్టు 8లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 35 ఏండ్లకు పైబడి 65 ఏండ్లలోపు వయస్సు కలిగి చైల్డ్ సైకాలజీ, లా, సోషల్‌వర్క్, సోషియాలజీ, హ్యుమన్ హెల్త్, హ్యుమన్ ఎడ్యుకేషన్, హ్యుమన్ డెవలప్మెంట్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేసిన వారు అర్హులని పేర్కొన్నది. పిల్లలు, మహిళా సంక్షేమ, సామాజిక సేవలో ఏడేండ్లు పనిచేయాల్సి ఉంటుందని నిర్దేశించింది. అభ్యర్థులు స్వయంగా ఎంపిక చేసుకున్న స్థానానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 33 జిల్లాల్లోని 66 బోర్డుల( జేజేబీ, డీసీబీలు 33 చొప్పున)కు సుమారు 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రాత పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. వీరు మూడేండ్లపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరాఖాస్తు గడువు ముగిసి ఇప్పటికే 20 రోజులు దాటింది. రెండువేలకు పైగా అభ్యర్థులు పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్లోనూ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఎప్పుడు పెడతారో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురువుతున్నారు. సంబంధిత బోర్డు అధికారులకు ఫోన్ చేసిన సరైన సమాధానం చెప్పడంలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నారు.