Telangana | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’లో అతడిది మంచి ఉద్యోగం, అంతేస్థాయి వేతనం. కానీ సొంత రాష్ట్రంలో పనిచేయాలన్న కోరికతో టీఎస్ జెన్కోలో ఉద్యోగం కోసం ప్రయత్నించి, సాధించాడు. నిరుడు సెప్టెంబర్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. 15 రోజుల్లో నియామక పత్రాలు ఇస్తామన్న సర్కారు మాటలు నమ్మిన అతడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నియామకపత్రాలు ఇవ్వకపోవడంతో పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లా తయారైంది. ఇటు కొత్త కొలువు రాక, అ టు ఉన్న కొలువు పోయి, నాలుగు నెలలుగా జీతం లేక నిరుద్యోగిగా మిగిలాడు.
మరో అభ్యర్థిది ఇండియన్ ఆయిల్ కా ర్పొరేషన్ (ఐవోసీఎల్)లో ఉద్యోగం. ఏడాదికి రూ.19 లక్షల వేతనం. జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ఉద్యోగం రావడంతో ఐవోసీఎల్కు రాజీనామా చేశాడు. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు నిరుద్యోగిగా మిగిలాడు.
ఇంకొక అభ్యర్థి కాగ్నిజెంట్‌లో రూ.లక్షల వేతనం వచ్చే ఉద్యోగం వదులుకోగా, మరో అభ్యర్థి పీహెచ్డీ సీటును రద్దు చేసుకున్నాడు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. వీరే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు అందుకుంటున్న పలువురు అభ్యర్థు లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి నట్టేట మునిగిపోయామని లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగాలకు ఎంపికైన ఆ అభ్యర్థులంతా గురువారం హైదరాబాద్ విద్యుత్తు సౌధ ఎదుట ధర్నాకు దిగారు. వెంటనే నియామక పత్రాలు ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కండ్ల ముందుకొచ్చిన కొలువు చేతిదాకా రాకపోవడంతో కడుపు మండి వారంతా గురువారం నిరసనల బాటపట్టారు.
టీజీ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం 2023 అక్టోబర్ 4న జెన్కో నోటిఫికేషన్ జారీచేసింది. 339 ఏఈ, 60 కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి 2024 జూలై 14న రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలు ప్రకటించి 2024 సెప్టెంబర్ 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించారు. ఐదేండ్లు పనిచేసేందుకు అధికారులు బాండ్ కూడా రాయించుకున్నారు. 15 రోజుల్లో నియామక ఉత్తర్వు లు ఇస్తామని చెప్పారు. దీంతో చాలామంది అభ్యర్థులు అప్పటివరకు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు నియామకపత్రాలు ఇవ్వలేదు. దీంతో ఎంపికైన అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. ఆ తర్వాత జెన్కో కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవలే గాంధీభవన్ ఎదుట అభ్యర్థులు ధర్నా చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గురువారం విద్యుత్తు సౌధ ఎదుట ధర్నాకు దిగారు. తక్షణమే తమకు నియామకపత్రాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.