హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో శిశు అభివృద్ధి ప్రాజెక్టు గ్రేడ్-1 అధికారుల (సీడీపీవో) రాత పరీక్షను రద్దు చేయడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. సీడీపీవో పరీక్షల రద్దు విషయంలో టీజీపీఎస్సీ అత్యుత్సాహం చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు ఉద్యోగ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకైన సంగతి తెలిసిందే. వీటిపై సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్), ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఓవైపు దర్యాప్తు జరుగుతుండగానే సీడీపీవో పోస్టుల కోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసి, వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఆ ఫలితాలను ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే అభ్యర్థుల తుది జాబితా కూడా మహిళాఅభివృద్ది, శిశు సంక్షేమ శాఖకు అందింది. ఇప్పుడు పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం అభ్యర్థులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. అధికారులు ఇంతకాలం తమకు ఆశలు కల్పించి, ఇప్పుడు నీళ్లు చల్లారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సీడీపీవో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మూడు వారాలలోపు నియామక పత్రాలు ఇవ్వాలని హైకోర్టు గతంలోనే టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసిందని అభ్యర్థులు తెలిపారు. కోర్టు ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారంటూ మరోవైపు కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. దీనిపై సోమవారం టీజీపీఎస్సీ వాదనలు వినిపించాల్సి ఉన్నది. ఇంతలోనే పరీక్షను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఫలితాలు విడుదల చేసిన దాదాపు ఐదున్నర నెలల తర్వాత సీడీపీవో పరీక్షలు విడుదల చేయడం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.