హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్18,(నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ గ్రూప్-1ను రద్దు చేసి మళ్లీ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షలో జరిగిన అన్యాయంపై శుక్రవారం ’హలో టీజీపీఎస్సీ లోపాలను సరిదిద్దుకో-గ్రూప్-1 అభ్యర్థులకు అన్యాయం చేయకు’ నినాదంతో హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని తమకు న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినదించారు. నిరుద్యోగ యువత నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా వారు తమ ఆవేదన వ్యక్తంచేశారు. టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో పోస్టులను కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారనే అనుమానాలు ఉన్నాయని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. మాధ్యమాల వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను బయట పెట్టాలని నినాదాలు చేశారు.
గ్రూప్-1 పరీక్షలు, ఫలితాల్లో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిటీ వేయాలని, సీబీఐతో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ వద్ద గ్రూప్-1 అభ్యర్థులు చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. 1,500 మంది పరీక్ష రాసిన రెండు సెంటర్లలో 24 మందికి టాప్ ర్యాంకులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ కలిసి అభ్యర్థులు అడుగుతున్న న్యాయమైన ప్రశ్నలకు బహిరంగంగా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. 30 మందికి ఒకే ర్యాంక్ ఎలా వస్తుందని అనుమానం వ్యక్తంచేశారు. ఇంగ్లిష్ మీడియం వాళ్లు అర్హత సాధించి, తెలుగు మీడియం వాళ్లు అర్హత సాధించకపోవడం వెనుక ఉన్న కుట్రలను బయటికి తీయాలని కోరారు. గ్రూప్-1 పరీక్ష పేరుతో రూ.కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జీవో 29తో ఎస్సీ, బీసీ బిడ్డలకు అన్యాయం చేశారని, ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
13 ఏండ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రకరకాలుగా మలుపులు తిరుగుతున్నదని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు జనార్దన్ తెలిపారు. ఈ పరీక్షల్లో 200కు పైగా తప్పులు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. అయినా కూడా ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ దశకు చేరిందని, ఈ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని గ్రూప్-1 అభ్యర్థి దామోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. టాప్-5లో ఒక్కరూ తెలుగు మీడియం అభ్యర్థి లేరని తెలిపారు. ఒకే పరీక్ష కేంద్రంలో 65 మంది అర్హత ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న చందంగా కాంగ్రెస్ పాలనలో వాళ్లకు కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. మూల్యాంకనం చేసిన వారి పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ గ్రూప్-1 పేపర్లను వెబ్సైట్లో పెట్టాలని, తాము అడుగుతున్న రీవాల్యుయేషన్‌కు అవకాశమివ్వాలని కోరారు.