Assembly Elections | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి మరో ఐదు రోజులే గడువు ఉన్నది. ఈ నెల 10న నామినేషన్ల గడువు ముగియనున్నది. ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 236 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు మంచిరోజు కోసం చూస్తున్నట్టుగా సమాచారం.
ఈ నెల 8,9న మంచి రోజులు ఉన్నాయని, 8న దశమి, 9న ఏకాదశి ఉండటంతో, 10న చివరిరోజు అయినందున ఈ మూడుదినాల్లో అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతాయని అధికారులు భావిస్తున్నారు. గుర్తింపు పొందిన పార్టీలతో పాటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడాఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయాల వద్ద పోలీసులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకొంటున్నారు. అభ్యర్థికి సంబంధించిన మూడు వాహనాలు, అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.