టొరొంటో, జూన్ 28: ఉన్నత చదువు, ఉద్యోగం కోసం మా దేశానికి రండి..అంటూ అమెరికాలోని భారతీయ సాంకేతిక నిపుణులకు కెనడా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. అమెరికా హెచ్1బీ వీసా కలిగిన 10వేలమందికి కొత్తగా ఓపెన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్‌ను కెనడా ప్రకటించింది. కుటుంబ సభ్యులకు స్టడీ, వర్క్ పర్మిట్‌ను ఇవ్వబోతున్నామని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ వెల్లడించారు. వీసాదారు భాగస్వామి, కుటుంబ సభ్యులు, డిపెండెంట్స్ కెనడాలో తాత్కాలిక నివాస వీసా పొందేందుకు అర్హులవుతారని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల శాఖ మంగళవారం ఓ ప్రకటన జారీచేసింది. “హైటెక్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడా రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో పనిచేస్తున్న చాలామంది హెచ్1బీ వీసాదారులే. జూలై 16, 2023 నాటికి హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నవారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కెనడా వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు” అని ప్రకటనలో వెల్లడించారు. ఈ కొత్త ప్రోగ్రామ్ కింద ఆమోదం పొందిన హెచ్1బీ వీసాదారులకు మూడేండ్ల కాలవధితో ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది. ఈ ఇమ్మిగ్రేషన్ స్ట్రీమ్‌ను ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఫ్రేజర్ వెల్లడించారు.