హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ‘అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను భూమి మీదికి సురక్షితంగా రప్పించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నేటి తరుణంలో.. కాళేశ్వరం మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లకు మరమ్మతులు చేయలేరా? అని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూధనాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడిగడ్డ పిల్లర్లు మరమ్మతులే కావు.. అనే మాటతో ఒక గొప్ప ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోకపోవడం సరికాదని హితవు పలికారు. దీనిని వదులుకోవడం బాధాకరమని, కాళేశ్వరం ఒక అద్భుతమైన భారీ ప్రాజెక్టు అని అభివర్ణించారు. అందులో అంతర్భాగం మేడిగడ్డ అని, దానిలో ఓ మూడు పిల్లర్లు కుంగాయని తెలిపారు.
2025-26 రాష్ట్ర బడ్జెట్ పద్దు శుక్రవారం శాసనమండలిలో ప్రారంభమైన చర్చలో బీఆర్ఎస్ తరఫున ఆయన మాట్లాడారు. నాడు కొట్లాడి తెలంగాణను సాధించిన కేసీఆర్.. కాళేశ్వరం లాంటి అద్భుతమైన భారీ ప్రాజెక్టు కడితే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పిల్లర్లను మరమ్మతు చేయించలేదా? అని సూటిగా ప్రశ్నించారు. ‘ఒక బలిష్టమైన ఏనుగు తోకకు ఏదో గాయమైతే.. ఆ ఏనుగు పనైపోయిందని ప్రచారం చేసినట్టుంది.. అని ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఓ పిట్ట కథతో పోల్చి చెప్పి ఆలోచింపజేశారు.
తెలంగాణ దార్శనీకుడు కేసీఆర్ హయాంలో తెలంగాణలో అద్భుతమైన జలకళ తొణికిసలాడిందని, నేడు కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షం నెలకొన్నదని విమర్శించారు. నాడు కేసీఆర్ పాలన విధ్వంసం కాదని, అద్భుతాలు సాధించిన ప్రగతిపథం అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 24 గంటల విద్యుత్తు సరఫరా, సాగు, తాగునీరు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేసిన మహనీయుడని కొనియాడారు.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అని ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని ఇప్పుడు అమలు చేయలేక అటకెక్కించిందని మధుసూధనాచారి తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్ల్లో రెండో విడుత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారని, పంపిణీనే మరిచారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థికసాయం అందిస్తామన్న కాంగ్రెస్ పాలకులు వాటి గురించి ఇప్పుడు మాట్లాడటమే మరిచారని కాంగ్రెస్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.
ఆసరా పింఛన్ల పెంపునకు మంగళం పాడి, చేయూతకు తూట్లు పొడిచారని, ఇతర అన్ని రకాల హామీలను కాలరాశారని దుయ్యబట్టారు. తండాల అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించినా నేటికీ ఇవ్వనేలేదని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల్లో విద్యా, వైద్యా రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. సర్కారు దవాఖానలల్లో దూదీ లేదు.. సూది లేదు.. మందు లేదు.. మంచం లేదు.. అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో విరాజిల్లిన ప్రభుత్వ గురుకులాలు.. కాంగ్రెస్ పాలనలో కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు పాముకాటుకు గురైనా పట్టించుకోని సర్కారు ఇప్పుడు రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్‌పై స్పష్టతే లేదని విమర్శించారు. బడ్జెట్లో మేం అడిగిన క్లారిఫికేషన్స్‌కు మంత్రి నుంచి పభుత్వం నుంచి సమధానం రాలేదు.