500 గజాల విస్తీర్ణంలో: మంత్రి వేముల
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించినట్టే హైదరాబాద్ ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాల నిర్మాణంపై మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో జరిగిన సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తోపాటు ఎమ్మెల్యేలు, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఆర్అండ్బీ సెక్రెటరీ శ్రీనివాస్‌రాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు. శాసనసభ్యులకు సౌకర్యవంతంగా ఉండటంతోపాటు ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందాలన్న లక్ష్యంతో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో దాదాపుగా అన్ని చోట్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు పూర్తయ్యాయన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో 500 చదరపు గజాల చొప్పున భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు.