కోదాడ : జీవితంలో అపురూపమైన క్షణాలను, లిప్తపాటులో జరిగే దృశ్యాలను జీవితకాలం పట్టి ఉంచగల అవకాశం ఒక్క ఫొటోగ్రఫీకే సాధ్యం. కాలాన్ని కటకంలో బంధించి ఫ్రేముల్లో అమర్చే నైపుణ్యం ఫొటోగ్రాఫర్లకే సొంతం. కోదాడ పట్టణానికి చెందిన ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కోలా వెంకటేశ్వర్లు అలియాస్ బొమ్మల వెంకన్న కెమెరా నుంచి జాలువారిన ఎన్నో ఛాయాచిత్రాలు అంతర్జాతీయ అవార్డులు పొందాయి.
ఆయన కెమెరా క్లిక్ అంటే చాలు ఆ చిత్రంలో ఎన్నో భావాలు స్పురిస్తాయి. గత నాలుగు దశాబ్దాలుగా తన కెమెరా కన్నుతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. తన ఛాయాచిత్రాలలో వేనవేల భావాలను నిక్షిప్తం చేశారు. వియత్నాం, కెన్యా దేశాలతోపాటు భారత్లోని మంగల్ జోడి, తొడాబా ఫారెస్ట్ రేంజ్లలో పులులు, సింహాలతోపాటు వివిధ జంతువుల జీవన ముఖచిత్రాలను సాక్షాత్కరింపజేశారు. పలు సరస్సులలో పక్షుల జీవన వైచిత్రిని తన కెమెరాల్లో బంధించారు.
ఆయన బాటలోనే కోదాడ పట్టణానికి చెందిన ఎంవీఆర్ శర్మ నడుస్తున్నారు. మంగల్ జోడితోపాటు కోదాడ పరిసర ప్రాంతాలలోని చిన్నచిన్న నీటి వనరులలో పక్షుల జీవన ముఖచిత్రాన్ని హృదయాలను కట్టిపడేసే విధంగా తన కెమెరాలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో గురుశిష్యులు మరెన్నో అవార్డులు పొందాలని వారి మిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.