హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో వరుసగా ఏటీఎంలు చోరీ చేస్తున్న ముఠాకు చెందిన ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రాజస్థాన్‌కు చెందిన జేసీబీ మెకానిక్‌లుగా గుర్తించారు. విమానంలో హైదరాబాద్ వచ్చి, అత్యంత పకడ్బందీగా రెక్కీ నిర్వహించి, గ్యాస్కట్టర్ల సాయంతో ఏటీఎంలను కట్ చేసి, 3 నిమిషాల్లో నగదు అపహరించడంలో ఈ ముఠాకు నైపుణ్యముందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాకు చెందిన రాహుల్ అలియాస్ రాహుల్‌ఖాన్ జేసీబీ మెకానిక్. తన బంధువుల్లో చాలామంది కూడా జేసీబీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. వీళ్లందరికీ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కోయడంలో అనుభవముంది. హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ఖాన్కు పహాడీషరీఫ్‌లోని ఓ మెకానిక్ షెడ్లో చేరాడు. జల్పల్లిలోని మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సర్ఫరాజ్ వద్ద ఆశ్రయం పొందాడు. హర్యానా నుంచి వచ్చి హైదరాబాద్‌లో మెకానిక్ పనిచేస్తున్న పర్వేజ్‌తో స్నేహం పెంచుకున్నాడు.
ఇద్దరు కలిసి ఫిబ్రవరి 22 నుంచి 26 వరకు రావిర్యాల, పహడీషరీప్, బాలాపూర్, జల్పల్లి, బీబీనగర్, భువనగిరిలో ఆటోలో తిరుగుతూ రెక్కీ నిర్వహించారు. రావిర్యాల, మైలార్‌దేవ్‌పల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాహుల్‌ఖాన్ బంధువులు షకీల్‌ఖాన్, వాహిబ్ఖాన్తో కలిసి ఫిబ్రవరి 28న పటాన్‌చెరువులోని ఏటీఎం కటింగ్ సామగ్రి కొన్నాడు. తన బంధువులైన ముస్తాఖీన్ఖాన్, షారుక్‌ఖాన్, సుబ్దిన్ఖాన్, రఫీక్‌ను మార్చి 1న ఢిల్లీ నుంచి విమానంలో రప్పించాడు. 2న రాత్రి 1.55 గంటలకు రావిర్యాల ఏటీఎంను కట్‌చేసి, రూ.29.69,900 నగదును అపహరించారు. అక్కడి నుంచి మైలార్‌దేవ్‌పల్లిలోని ఏటీఎం కట్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులను లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు రాహుల్‌ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వాహిద్‌ఖాన్, షకీల్‌ఖాన్, సర్ఫరాజ్‌ను అరెస్టు చేశారు. షారుఖ్‌ఖాన్, బషీర్‌ఖాన్ విశాఖపట్నం జైల్లో ఉండగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.4లక్షల నగదు, కారు, స్వాధీనం చేసుకున్నారు.
నేరం చేస్తే పట్టుకోవడం ఖాయం
హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయి. నేరం జరుగకుండా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. ఒక వేళ నేరం జరిగితే నిందితులను పట్టుకోవడం ఖాయం. అధికారులు 20 రోజుల పాటు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, వివిధ రాష్ర్టాలలో గాలించి సంచలన కేసును ఛేదించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి బృందానికి అభినందనలు. నిందితులపై నగరంలో మరో నాలుగు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
-సుధీర్‌బాబు, రాచకొండ సీపీ