ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించగా, రాజకీయ స్వార్థం, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పును అపహాస్యం చేసిన పార్టీ ఫిరాయింపుదారులకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ టికెట్‌పై గెలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఫిరాయింపు కేసుల నిర్ణయంలో జాప్యం రాజ్యాంగ విధులను ఉల్లంఘిం చడమేనని ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయించిన (Party Defection) బెంగాల్ నేత ముకుల్‌రాయ్ (Mukul Roy) శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు (Calcutta High court) గురువారం కీలక తీర్పును వెలువరించింది. విశేషాధికారాల ముసుగులో ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసే ధోరణిని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. అధికారం అండతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చర్యలను అడ్డుకొనే దిశగా కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదిగా న్యాయనిపుణులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నార్త్ స్థానానికి 2021లో ఎన్నికలు జరిగాయి. బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన ముకుల్‌రాయ్ ఆ స్థానంలో విజయం సాధించారు. గెలిచిన 3నెలల్లోనే ఆయన టీఎంసీలో చేరా రు. ముకుల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. బీజేపీ నాయకులైన సువేందు అధికారి, అంబికా రాయ్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ముకుల్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు. 2022లో దీనిపై స్పీకర్ విచారణ చేపట్టారు. తాను ఇంకా బీజేపీలోనే ఉన్నానని ముకుల్‌రాయ్ విచారణలో తెలిపారు. దీంతో ఈ కేసులో ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించబోదని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ముకుల్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ట్టు తీర్మానించారు. స్పీకర్ ఎదుట బీజేపీలోనే ఉన్నానని వెల్లడించిన ముకుల్‌రాయ్.. టీఎంసీ ప్రభుత్వంలో భాగమయ్యారని, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన కోర్టు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో ఉన్న రూల్స్ ఆఫ్ 1986 కింద.. ముకుల్‌రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని, పీఏసీ నామినేషన్‌ను రద్దు చేస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది.
ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అక్రమమేనని జస్టిస్ దేబాంగ్సు బసక్, జస్టిస్ మహమ్మద్ షబ్బార్ రషీదీతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ముకుల్‌రాయ్ శాసన సభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. ముకుల్ రాయ్ బీజేపీ ఎమ్మెల్యే అని, ఈ క్రమంలో ఆయనపై ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవడానికి కుదరదని నిర్ధారించిన స్పీకర్ నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా కోర్టు పక్కన బెట్టింది. ముకుల్‌రాయ్ ఫిరాయింపు కేసు నాలుగేండ్లుగా కొనసాగుతుండటంపై కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాల్లో జాప్యం రాజ్యాంగబద్ధ విధుల ఉల్లంఘన కిందికే వస్తుందని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా కలకత్తా హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొత్త భయాలు నెలకొన్నాయి. సోమవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ రానున్న క్రమంలో.. తమ పరిస్థితి ఏమిటని ఆయా ఎమ్మెల్యేలు సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం.
ఫిరాయింపు నిరోధక చట్టం కింద చట్టసభలోని ప్రతినిధులపై అనర్హత వేటు వేయడం కొత్తేం కాదు. మణిపూర్‌కు చెందిన ప్రస్తుత బీజేపీ నేత తౌనోజామ్ శ్యామ్‌కుమార్ సింగ్ 2017లో కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం అధికార బీజేపీలో చేరారు. దీంతో క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కింది. తమ పార్టీ టికెట్‌పై గెలిచి బీజేపీలో చేరిన శ్యామ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలంటూ 2017లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మూడేండ్లపాటు ఈ పిటిషన్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ కేసును 18 మార్చి 2020న విచారించిప సుప్రీంకోర్టు.. శ్యామ్‌కుమార్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది. అంతే కాకుండా, తాము ఉత్తర్వులు ఇచ్చే వరకూ శ్యామ్‌కుమార్ శాసనసభలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది.