Ration Card | హైదరాబాద్, ఆగస్టు10 (నమస్తే తెలంగాణ): కొత్త రేషన్‌కార్డుల జారీకి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఎవరెవరికి ఇవ్వాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. పట్టణ ప్రాంతా ల్లో రేషన్‌కార్డుల జారీకి రూ. 2 లక్షల వార్షిక ఆదాయ పరిమితి విధించాలని నిర్ణయించినట్టు దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.5 లక్షలు, లేదా 3.5 ఎకరాల మాగాణి, లేదా 7.5 ఎకరాల మెట్టభూమి ఉన్న వారిని అర్హులుగా గుర్తించాలని అధికారులకు సూచించింది.
పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం సచివాలయంలో పౌరసరఫరాల కార్యదర్శి డీఎస్ చౌహాన్, ఆరోగ్యశాఖ కార్యదర్శి చొంగ్తూ తదితరులతో భేటీ అయింది. ఈ సందర్భంగా రేషన్‌కార్డుల జారీపై సుదీర్ఘంగా చర్చించింది.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారందరికీ రేషన్‌కార్డులు అందేలా లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది. రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులందరి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తక్షణమే రాజ్యసభ, లోకసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరికీ లేఖలు రాయాలని, సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖకు సూచించారు. డాక్టర్ ఎన్సీ సక్సేనా కమిషనర్‌గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను రేషన్‌కార్డుల జారీలో పరిగణనలోకి తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారని గుర్తుచేశారు.
ప్రభుత్వ సూచన మేరకు అధికారులు వివిధ రాష్ర్టాల్లో తెల్లరేషన్‌కార్డు మంజూరుకు అవలంబిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేశారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వారికి అకడా, ఇకడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్టు తేలిందని, అటువంటి వారికి ఎక్కడైనా ఒక్క చోటనే కార్డు ఉంచుకునే ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపైనా ఉపసంఘం చర్చించినట్టు ఉత్తమ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త తెల్ల రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరించగా 10లక్షలు వచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్ల చేర్పు కోసం 11.33 లక్షల అర్జీలు వచ్చాయని, వాటన్నింటి మంజూరుకు ప్రభుత్వానికి రూ. 956కోట్లు ఖర్చవుతుందని వివరించారు.