హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం జరగాల్సిన మంత్రి మండలి సమావేశం (Cabinet Meeting) వాయిదాపడింది. ముఖ్యమంత్రి సహా కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో క్యాబినెట్ భేటీని ప్రభుత్వం వాయిదావేసింది. ఈ సమావేశాన్ని ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించింది.
ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొంటున్నారు. వీరితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. సీఎంతోపాటు మొత్తం ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో క్యాబినెట్ సమావేశానికి కోరం ఉండకపోవచ్చన్న అంచనాతో వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.