హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఈనెల 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదలచేసింది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ స్థానం ఏర్పడింది. ఏప్రిల్ 2, 2024తో వరకు ఈ స్థానానికి కాలపరిమితి ఉండటంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. బీహార్లో ఓ స్థానానికి కూడా ఈనెల 30న ఉపఎన్నిక జరుగనున్నది. జేడీయూ రాజ్యసభ సభ్యుడు మహేంద్ర ప్రసాద్ గత ఏడాది డిసెంబర్ 27న మృతిచెందడంతో ఈ సీటు ఖాళీ అయింది.