హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తేతెలంగాణ): రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించేలా మాట్లాడినా ప్రధాని మోదీ మాత్రం ఇప్పటికీ నోరువిప్పడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ 30న దేశవ్యాప్త నిరసన చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికైనా అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చుక్క రాములు, జ్యోతితో కలిసి సీపీఎం 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను రాఘవులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు చాలా ప్రమాదకరమైనదని, ప్రాంతీయ పార్టీలకు గొడ్డలి పెట్టు అవుతుందని తెలిపారు.
హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ మంచిది కాదని తెలిపారు. రుణమాఫీ పూర్తికాలేదని, ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు నోచుకోలేదని, రైతు భరోసాను అమలు చేయాలని, కౌలు రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర మహాసభలు జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.