హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తేతెలంగాణ): యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ నిన్నటివరకు సర్కారు ఊదరగొట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ హైటెక్స్‌లో యంగ్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ (బిజినెన్ ఎక్స్పో)ను ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహిస్తామని సర్కార్ ప్రకటించింది.
తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 300 మంది చొప్పున విద్యార్థులను ఆహ్వానించింది. 10,000 భవిష్యత్తు స్టార్టప్‌ల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఊదరగొట్టారు. ఈ సమ్మిట్ శుక్రవారం రోజున ప్రారంభం కావాల్సి ఉండగా, ఇదేరోజు ఉన్నట్టుండి అర్ధాంతరంగా ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను రద్దుచేసింది. కారణాలు ఏమిటనేది ఎవరికీ చెప్పలేదు. కానీ గ్లోబల్ సమ్మిట్ వైఫల్యమే ఈ బిజినెస్ ఎక్స్పో రద్దుకు ప్రధాన కారణమని యువ పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఆర్భాటం చేసినా ఆశించిన మేరకు గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కాలేదు. పారిశ్రామికవేత్తలెవరూ ఆసక్తి చూపలేదు. దీంతో గతంలో చేసుకున్న ఒప్పందాలనే, అవే కంపెనీలతో చేసుకుని సర్కారు మమ అనిపించింది. ప్రస్తుతం నిర్వహించ తలపెట్టిన బిజినెస్ ఎక్స్‌పోకు కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ వైఫల్యాన్ని ముందే పసిగట్టిన ప్రభుత్వం, మరోసారి పరువు పోగొట్టుకోవడం ఎందుకని ముందుగానే సమ్మిట్‌ను రద్దు చేసుకున్నట్టు చర్చ కొనసాగుతున్నది.
బిజినెస్ సమ్మిట్‌ను రద్దు చేయడంపై యువ పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. మెస్సీతో జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌పై నిర్లక్ష్యం చూపిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువ పారిశ్రామికవేత్తలు దీనిపై ఆసక్తి చూపలేదని వివరిస్తున్నారు. సమ్మిట్ కోసం ఇప్పటికే లక్షలు వెచ్చించామని పలువురు యువ పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో తమకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని మండిపడుతున్నారు.