శాయంపేట, అక్టోబర్ 3: కట్టుకున్న భార్య ఈ లోకాన్ని వీడి వెళ్లినా.. ఆమెపై ఉన్న ప్రేమ కు గుర్తుగా బస్సు షెల్టర్ నిర్మిస్తున్నాడు భర్త. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన బొమ్మకంటి శ్రీకాంత్, ప్రియాం క దంపతులు. ఏడేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నారు. దాంపత్య జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలో ప్రియాంక అనారోగ్యంతో జూన్ 21న మరణించింది. కలత చెందిన ఆయన ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ప్రియాంకకు గుర్తుగా ఆమె పేరిట ప్రజల సౌకర్యార్థం గ్రామ కూడలి వద్ద బస్ షెల్టర్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.50 వేలు వెచ్చిస్తున్నారు. శ్రీకాంత్ చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.