కలెక్టరేట్/సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 11: చిన్న చిన్న దొంగతనాలతో లాభం లేదనుకున్నాడో ఏమో.. ఏకంగా ఆర్టీసీ హైర్ బస్సునే అపహరించాడు. ప్రయాణికులను ఎక్కించుకొని టికెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేశాడు. డీజిల్ అయిపోవడంతో ఆగిన చోటే బస్సును వదిలేసి పారిపోయాడు. చివరికి ఆ దొంగ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం జరిగింది. సీఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం.. సిద్దిపేట ఆర్టీసీ డిపోలో స్వామి అనే వ్యక్తి అద్దె బస్సు నడుపుతున్నాడు. రోజు మాదిగానే ఆదివారం రాత్రి ఆర్టీసీ డిపో ముందు రోడ్డుపైన బస్సును డ్రైవర్ నిలిపి వెళ్లాడు. డ్రైవర్ బస్సు తాళం అక్కడే పెట్టాడు. సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ బస్సును తోలుకెళ్లాడు. సిరిసిల్లకు, వేములవాడకు ప్రయాణికులను తీసుకొచ్చాడు. సిరిసిల్ల నుంచి తిరుగు ప్రయాణంలో తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద డీజిల్ అయిపోవడంతో బస్సు ఆగిపోయింది. టికెట్లు ఇవ్వకపోవడం, బస్సు ఆగడంపై ప్రయాణికులు ప్రశ్నించడంతో అతడు పొంతన లేని సమాధానాలు చెప్తూ పారిపోయాడు. చోరీ విషయం తెలుసుకున్న బస్సు యజమాని స్వామి అప్పటికే సిద్దిపేట వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు.. దొంగను సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్‌కు చెందిన బందెల రాజుగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బస్సులో 210 లీటర్ల డీజిల్ పోయించుకుని ట్రిప్‌కు వెళ్తామని, ఆదివారం రాత్రి బస్సులో 30 -40 లీటర్ల డీజిల్ ఉండవచ్చని, అది అయిపోయిందాక నడిపి బస్సును దొంగ వదిలేశాడని స్వామి తెలిపారు.