టీజీపీఎస్సీ చైర్మన్ పోస్టు బాధ్యతాయుతమైనది. ఇది నాకు లభించిన మంచి అవకాశంగా భావిస్తా. చైర్మన్‌గా ఐదున్నరేండ్లు పనిచేసే అవకాశం ఉంటుంది. నేను కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించా. ఉద్యోగార్థుల బాధల తెలుసు. వారు పడే కష్టాలు తెలుసు. వారి కష్టాలు తీర్చేందుకు నా వంతుగా ప్రయత్నిస్తా. సర్వీస్ కమిషన్‌కు అప్పగించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెంట వెంటనే నోటిఫికేషన్లు జారీచేస్తాం. పెండింగ్‌లోని ఉద్యోగాల భర్తీని సకాలంలో పూర్తిచేస్తాం.
Burra Venkatesham | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. నూతన చైర్మన్ నియామకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ శనివారం ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం మహేందర్‌రెడ్డి డిసెంబర్ 2వ తేదీతో పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌గా బుర్రా వెకంటేశంను ప్రభుత్వం నియమించింది. కొత్త చైర్మన్ నియామకానికి సర్కారు గతంలోనే నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 45 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో రిటైర్డ్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఉన్నారు. వారిలో చైర్మన్ పోస్టుకు బుర్రా వెంకటేశంను ఎంపికచేసిన సర్కారు ఈ నియామకం ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించింది. దీంతో గవర్నర్ శనివారం ఆ ఫైల్‌పై ఆమోదముద్ర వేశారు. బుర్రా వెంకటేశంకు మరో మూడున్నరేండ్ల సర్వీసు ఉండగా, టీజీపీఎస్సీ చైర్మన్‌గా 62 ఏండ్ల వరకు కొనసాగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ ఐదున్నరేండ్లు అంటే 2030 వరకు కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం ప్రభుత్వ బడిలో, గురుకులంలో చదువుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితోపాటు బుర్రా వెంకటేశం సైతం సర్వేల్ గురుకుల పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. ట్యూషన్ టీచర్‌గా తన ప్రస్తానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగిన బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్‌గా అత్యున్నత స్థానానికి ఎదిగారు. బుర్రా వెంకటేశం డిసెంబర్ 2న లేదా ఆ తర్వాత చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.
తపన ముందు తలవంచిన విధి
బుర్రా నారాయణగౌడ్, గౌరమ్మ దంపతులకు జన్మించిన బుర్రా వెంకటేశం రెండో తరగతి చదువుతున్నప్పుడే తండ్రిని కోల్పోయారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య చదువు ముందుకుసాగింది. తనను చదివించేందుకు అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి ఆ కష్టాలు తీరాలంటే పెద్ద చదువులు చదవాలని, పెద్ద ఉద్యోగం సాధించాలని చిన్నప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వగ్రామంలో 7వ తరగతి వరకు చదివి ఏడో తరగతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా సర్వేల్ గురుకులంలో చేరి పదో తరగతిలోనూ టాపర్‌గా నిలిచారు. ఇంటర్ విద్య అనంతరం, అమ్మకు భారం కాకూడదని ఖర్చులకు డబ్బులు లేక ట్యూషన్స్, హోం ట్యూషన్స్ చెప్తూ డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ విద్యనభ్యసించారు. ఐఏఎస్ కావాలన్న ఆశయంతో 1990లో సివిల్స్ రాసి తొలి ప్రయత్నంలోనే సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం సాధించారు. మరో ప్రయత్నంలో ఎలాంటి కోచింగ్ లేకుండా 1995లో జాతీయస్థాయిలో 15వ ర్యాంక్, ఉమ్మడి ఏపీలో టాపర్‌గా నిలిచారు. ఆయన తపన ముందు విధి తలవంచి విజయాన్ని దరిచేర్చింది. ఎప్పుడూ పెద్ద లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకెళ్లే ఆయన ప్రస్తానం కష్టానికి ప్రతిరూపంగా, విజయానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐఏఎస్ కావాలంటే డిగ్రీ చదవి ఉండాలన్న ఏకైక లక్ష్యంతో డిగ్రీలో చేరారు. పైగా డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఫలితాలు రాకముందే, సివిల్స్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించడం విశేషం.
బహుముఖ ప్రజ్ఞాశాలి
బుర్రా వెంకటేశం పరిపాలనారంగంతోపా టు సాహిత్యరంగంలోనూ రాణించారు. స్వ యంగా రచయిత కూడా. ఆయన రచించిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ ఆంగ్ల పుస్తకం ఐదు నెలల్లోనే 42వేల కాపీలు అమ్ముడయ్యాయి. గెలుపు పిలుపు, జీవనధన్య శతకం, బుద్ధంశరణం గచ్ఛామి, రామాయణ పరివారము, అనుబంధాల పూదోట వంటి పుస్తకాలు ప్రాచుర్యం పొందాయి. మెదక్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు పరిపాలనకు సోషల్ అకౌంటబిలిటీ ఇంటర్నేషన్ న్యూయార్క్ ద్వారా ఎస్ఏ 8000 సర్టిఫికెట్ పొందారు. ఆసియాలోనే తొలి సర్టిఫికెట్ ఇది. ఇందుకు రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ప్రశంసలు లభించాయి. కట్టుబానిసల విముక్తి, పేదలకు భూపట్టాల పంపిణీకి చొరవచూపినందుకు జాతీయ ఎస్సీ కమిషన్‌తోపాటు ప్రధానమంత్రి ప్రశంసలు లభించాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్ర వెంకటేశంను ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కాగా, ఆయనను టీజీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించేందుకు గవర్నర్ ఆమోదం లభించగా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు.
కీలక బాధ్యతలు
ఐఏఎస్ శిక్షణ అనంతరం బుర్రా వెంకటేశం ఆదిలాబాద్‌లో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా, రంపచోడవరం, రాజమండ్రి సబ్ కలెక్టర్, వరంగల్ మున్సిపల్ కమిషనర్, చిత్తూరు, గుంటూరు జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా, మెదక్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఐటీ శాఖ డైరెక్టర్‌గా మెడికల్, టూరిజం కార్పొరేషన్ల ఎండీగా, హౌజింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. 2014లో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్‌గా, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా సేవలందించారు. ప్రపంచ తెలుగు మహాసభల కోర్‌కమిటీ సభ్యుడిగా విజయవంతంగా పనిచేశారు.
పేరు ; బుర్రా వెకంటేశం
పుట్టిన తేదీ ; 1968 ఏప్రిల్ 10న
తల్లిదండ్రులు ; నారాయణగౌడ్, గౌరమ్మ
స్వస్థలం ; జనగామ జిల్లా ఓబుల్ కేశవాపురం
చదువు: బీఏ, ఎల్ఎల్బీ (1989లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో బీఏ, ఉస్మానియా నుంచి 1992లో ఎల్ఎల్బీ)
ప్రస్తుత హోదా: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ