హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): కాబోయే అమ్మల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టిఫా స్కానింగ్ యంత్రాలు అద్భుత ఫలితాన్ని ఇస్తున్నాయి. నెల రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా గర్భిణులకు ఏకంగా రూ.కోటికిపైగా ఆదా చేశాయి. దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం శిశువు ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా వివరించే టిఫా స్కానింగ్ యంత్రాలు లేవని గుర్తించింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు చొరవతో కేవలం రెండు నెలల్లోనే 56 టిఫా స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది నవంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా 44 దవాఖానల్లో టిఫా స్కానింగ్ సేవలను ప్రారంభించారు. ఇందులో 19 టీవీవీపీ దవాఖానలు, 25 డీఎంఈ పరిధిలోని దవాఖానలు ఉన్నాయి. మొత్తం రూ.20 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు.
నెలలోనే రూ.కోటి ఆదా
ప్రారంభమైన ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1800 స్కానింగ్‌లు తీశారు. డీఎంఈ పరిధిలో సుమారు 1500, టీవీవీపీ పరిధిలో 300 స్కానింగ్‌లు జరిగాయి. డిసెంబర్ నెలలో టీవీవీపీ పరిధిలో 1170, డీఎంఈ పరిధిలో 2464 స్కానింగ్‌లు తీశారు. మొత్తంగా డిసెంబర్ నెలలోనే 3,634 స్కానింగ్‌లు జరిగాయి. టిఫా స్కానింగ్‌కు ప్రైవేట్ ల్యాబుల్లో సగటున రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్క డిసెంబర్ నెలలోనే గర్భిణులకు రూ.1.09 కోట్లు ఆదా అయ్యాయి. నవంబర్‌ను కలిపితే రూ.కోటిన్నర వరకు ఆదా అయినట్టేనని అధికారులు చెప్తున్నారు.