వేములవాడ రూరల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధి తిప్పాపూర్‌లో సోమవారం తెల్లవారుజామునే బుల్డోజర్లు భవనాలను కూల్చేందుకు వచ్చాయి. తిప్పాపూర్ నుంచి వేములవాడకు వెళ్లేందుకు రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకుండానే ఇండ్లను కూల్చివేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేశారు. బ్రిడ్జి పనులకు సంవత్సరం పట్టనుండగా అప్పుడే ఇండ్లను కూల్చివేయడం ఏమిటని నిలదీశారు. తిప్పాపూర్ బ్రిడ్జి సమీపంలోని ఇండ్లను కూల్చివేసే ముందు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకట్‌రెడ్డి రాజేశ్వరి అనే బాధితురాలు ఇండ్ల పరిహారం ఇవ్వకుండానే కూల్చివేయడంపై ప్రభుత్వంతోపాటు స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
పనులను అడ్డుకోవడంతో ఆమెను పోలీసులు బలవంతంగా అక్కడినుంచి లాక్కెళ్లారు. సర్దుకునేందుకు ఒక రోజైనా సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో దుకాణాలను కూల్చివేయడంతో కొందరు అప్పటికప్పుడు సామగ్రిని ఆటోల్లో తరలించారు. కల్లెపల్లి బాబు తనకు పరహారం ఇచ్చేంతవరకు భవనాన్ని కూల్చనివ్వబోమని కుటుంబ సభ్యులతో కలిసి భవనంపైకి బైఠాయించారు. కూల్చివేతలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసేందేమీలేదని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ మండిపడ్డారు. బాధితుల తరఫున నిరసన వ్యక్తంచేశారు.