హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : గ్రామస్థాయిలో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఫెడరేషన్లకు భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు రూ.10 లక్షల ఉపాధి హామీ నిధులతో 200 గజాల్లో, 552 చదరపు అడుగుల్లో ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇందు కు సంబంధించిన ఉత్తర్వులను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన బుధవారం జారీచేశారు. గ్రామసభ తీర్మా నం ఆధారంగా ప్రతిపాదనలు రూపొందిం చి, మండల, జిల్లా స్థాయిల ద్వారా జిల్లా కలెక్టర్ అనుమతితో పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిర్మాణ పనులను పీఆర్ ఇంజినీరింగ్ సిబ్బంది పర్యవేక్షణలో పూర్తిచేయాలని సూచించారు. ఉపాధిహామీ నిధులతో పనులు చేపడుతున్నందున సా మాజిక తనిఖీ తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. భవన నిర్మాణ పనులు పూర్తయి న ఆరు నెలల్లోపు సోషల్ ఆడిట్ పూర్తి చే యాలని పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లు, పీఆర్ఆర్డీ అధికారులు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంచేశారు.
గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతానికి ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాల నిర్మాణాలు చారిత్రాత్మక ముందడుగు అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక తెలిపారు. గ్రామీణ మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా, స్వయం ఉపాధి, నిర్ణయాధికార కేంద్రాలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకే ప్రతి గ్రామంలో ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనం ఉండాలని, మహిళలకు ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వమని ధ్యేయమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.