హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వారిని తప్పకుండా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. హైటెక్స్‌లో జరుగుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. దేశీయ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్ల భాగస్వామ్యం ఎకువగా ఉన్నదని, దేశ సంపదను సృష్టించడంలో తెలుగు రాష్ట్రాల బిల్డర్లు కీలక భూమిక పోషిస్తున్నారని ప్రశంసించారు. సంక్షేమ రాజ్యం కావాలంటే సంపద కావాలని, సంపదను సృష్టించే సంస్థలు ఉన్నప్పుడే ప్రజల సంక్షేమ అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవని చెప్పారు.
సంపదను సృష్టించే సంస్థలకు ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, తెలంగాణలో సంపద సృష్టించేవారికి అన్నివిధాలుగా సహకరిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయన కన్వెన్షన్ వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ‘బిల్డింగ్ త్రూ టైం’, ‘టెక్నికల్ వాల్యూమ్’ పుస్తకాలను ఆవిషరించారు. కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, చైర్మన్ బీ శ్రీనయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ సచితానందరెడ్డి, రాష్ట్ర చైర్మన్ దేవేందర్‌రెడ్డి, కో-వైస్‌చైర్మన్ డీవీఎన్ రెడ్డి, నేషనల్ కన్వెన్షన్ చైర్మన్ ఆర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.