ఖైరతాబాద్, మే 19 : కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన ఫ్లాట్లపై ఓ బిల్డర్ అక్రమంగా భారీ ఎత్తున రుణం తీసుకున్నాడని మియాపూర్‌కు చెందిన పలువురు ఫ్లాట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేఎస్ఆర్ టుగెదర్మెంట్స్ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జనార్దన్ రెడ్డి, రాజా, ప్రభావతి, పవన్ కుమార్‌లు మాట్లాడుతూ 2019 నుంచి 2021 మధ్య సదరు అపార్ట్మెంట్లో సుమారు 150 మంది రూ.1.50 కోట్ల నుంచి రూ.2కోట్ల వరకు చెల్లించి ఫ్లాట్లను సొంతం చేసుకున్నామని తెలిపారు. ఫ్లాట్ల కొనుగోలుకు ముందు సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తీరా ఫ్లాట్లు కొన్నాక ఫైర్ అలార్మింగ్ సిస్టమ్ లేదని, గ్రీనరీ, ఐల్యాండ్లు కట్టలేదని, పార్కింగ్ విషయంలోనూ తక్కువ మందికి అనుమతి తీసుకొని ఎక్కువ మందికి విక్రయించాడని ఆరోపించారు. తాజాగా పలు ఫ్లాట్లను తనఖా పెట్టి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రూ.60కోట్లు రుణం తీసుకున్నట్టు తెలిసిందని, ఈ విషయమై తాము 14 సార్లు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఇదేంటని నిలదీస్తే తమపై దాడులు చేయిస్తానంటూ బెదిరిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.