Operation Musi | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): ఖుల్లం ఖుల్లా… మూసీ పరీవాహక ప్రాంత ప్రజల భవిష్యత్తు తేలిపోయింది. ఇప్పటిదాకా కేవలం రివర్ బెడ్ ఇండ్ల కూల్చివేతనే అంటూ కాస్తోకూస్తో ఊపిరి పీల్చుకుంటున్న పరీవాహక ప్రాంత ప్రజలపై సాక్షాత్తూ సీఎం రేవంత్‌రెడ్డి మరో పిడుగు వేశారు. రివర్ బెడ్, ఎఫ్ఆర్ఎల్.. కాదు ఏకంగా బఫర్‌జోన్ దాకా విస్తరణ చేపడతామని ప్రకటించారు. రెండు రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు దీనిపై స్పష్టత ఇచ్చారు. మూసీకి రెండు వైపులా బఫర్‌జోన్ దాకా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని అధికారికంగానే చెప్పారు. అంటే ఎంఆర్డీసీఎల్ (మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారులు రూపొందించిన మ్యాపులో బ్లూ కలర్ గీత నుంచి 30 మీటర్లు అంటే సుమారు వంద ఫీట్లు వరకు ఉండే నిర్మాణాలను కూడా కూల్చివేయనున్నారు. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ ముందుగా అంచనా వేసినట్టుగానే దాదాపు లక్షన్నర నిర్మాణాలకు ఎసరు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు గుర్తించిన మూసీ మ్యాపింగ్ ప్రకారం రివర్ బెడ్(రెడ్ లైన్), ఫుల్ రివర్ లెవల్(బ్లూ లైన్) మాత్రమే ఉంది. కానీ ఎఫ్ఆర్ఎల్ హద్దుల నుంచి మరో 30 మీటర్ల దూరం ఉండే ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా నిర్ధారించనున్నారు. దీంతో రెడ్, బ్లూ లైన్ల తరహాలో మరో గీత గీసి పేద, మధ్యతరగతి వర్గాల సొంతిళ్లను మూసీలో కలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమైంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలే సాక్ష్యంగా నిలుస్తుండగా, మూసీ ప్రాజెక్టు పేరిట లక్షలాది మంది పేద, మధ్యతరగతి వర్గాలు అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇండ్లు, అపార్టుమెంట్లు, భవనాలు కుప్పకూలిపోనున్నాయనేది స్పష్టమైంది. తొలుత కలుషిత వాతావరణం, దోమలు, చెత్తాచెదారంతో ఉండే మూసీ రివర్ బెడ్ నివాసితులను తొలగిస్తామని చెప్పిన ప్రభుత్వం.. దశల వారీగా మూసీ ఎఫ్ఆర్ఎల్కి వంద మీటర్ల దూరంలో అన్ని అనుమతులతో నిర్మించుకున్న భవనాలనూ కూల్చనుంది. రివర్బెడ్ నిర్మాణాలు, ఎఫ్ఆర్ఎల్ కట్టడాలతోపాటు బఫర్ జోన్ల వారీగా మూసీ వెంబడి మార్కింగ్ చేస్తే ఇప్పుడున్న లక్షన్నర నిర్మాణాల సంఖ్య తారుమారు కానుంది. మూసీకి ఇరువైపులా 30 మీటర్ల దూరా న్ని బఫర్ జోన్‌గా నిర్ధారించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే మూసీలో మునిగే నిర్మాణాల సంఖ్య మరో 2 లక్షలకు పెరగనుంది. దీంతో మూడున్నర లక్షలకు పైగా నిర్మాణాలు మూసీలో కొట్టుకుపోనున్నాయి.
బరాబర్ బఫర్ జోన్ తొలగించుడే
ఎంఆర్డీసీఎల్ ప్రకటించిన మ్యాపింగ్ ఆధారంగా ఇప్పటివరకు బఫర్ జోన్ నిర్ధారణ కాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాటలు పేద, మధ్యతరగతి వర్గాలను భయాందోళనలకు గురిచేసేలా ఉన్నాయి. బరాబర్ బఫర్ జోన్ నిర్మాణాలను తొలగించాల్సిందేనని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తుండటంతో బఫర్ జోన్ మరింత ఆందోళనకరంగా మారనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మ్యాపింగ్ ప్రకారం పుల్ రివర్ లెవల్ పరిధిలోనే వందలాది నిర్మాణాలు ప్రభావితం అవుతున్నాయి. అందులోనూ గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లతోపాటు, అన్ని అనుమతులతో నిర్మించుకున్న భవనాలు కూడా ఉన్నాయి. ఇక బఫర్ జోన్ పరిధిని కూడా నిర్ధారిస్తే మూసీ పరీవాహక ప్రాంతం మరింత పెరుగుతుందని, ఇప్పుడున్న దానికంటే రెండింతల వెడల్పుగా మారబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రివర్ బెడ్ పరిధి వరకే కలుషిత వాతావరణం, దుర్గందమైన పరిసరాలు ఉన్నాయి. కానీ బఫర్ జోన్ ప్రాంతాన్ని నిర్ధారిస్తే గనుక… దశాబ్దాల క్రితమే హుడా, జీహెచ్ఎంసీ లాంటి సంస్థల అనుమతులతో నిర్మించుకున్న కట్టడాలన్నీ కూలనున్నాయి. ఇప్పటికే ఎఫ్ఆర్ఎల్ పరిధిలో ఉండే ఆలయాలు, చర్చిలు, మసీదుల తొలగింపు అనివార్యంగా మారింది. ఇక బఫర్ జోన్ నిర్ధారణ జరిగితే ఇన్నాళ్లు చిన్న చిన్న గుడిసెలు, రేకుల షెడ్డులో ఉన్న పేదలతో పాటు, పదికాలాలు కుటుంబానికి నీడనిచ్చేలా నిర్మించుకున్న భవంతులూ కూలక తప్పదు.
ఊసే లేని భూసేకరణ
బఫర్ జోన్ నిర్మాణాలను తొలగించాల్సిందేనని చెబుతూనే బఫర్ జోన్ పరిధిలో కూలిపోయే నిర్మాణాలకు ప్రత్యామ్నాయం చూపుతామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారే తప్ప భూసేకరణ విషయాన్ని ప్రస్తావించడం లేదు. పట్టా భూముల్లోని కట్టడాలు, నిర్మాణాలను ప్రభుత్వం కూలగొట్టాలంటే కచ్చితంగా వారి నుంచి భూములను సేకరించాల్సిందే. దీనికి 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూసేకరణ చట్టంప్రకారమే సేకరించాల్సి ఉంటుంది. కానీ ఆ చట్టం ఊసే ఎత్తకుం డా నేరుగా బఫర్ జోన్ మార్కింగ్‌తో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన నిర్మాణాలను కూల్చే కుట్రలకు రేవంత్ తెరలేపారు.
చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉండే నిర్మాణాలను కూల్చేస్తాం. నాలాలు, కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం. మూసీ రివర్ బెడ్‌తో పాటు బఫర్ జోన్ పరిధిలో ఉండే జనాలను అక్కడి నుంచి తరలించాల్సిందే.
– 3న సికింద్రాబాద్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రారంభ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి