హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే 19పద్దులపై చర్చను ప్రారంభించే ముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ్యులకు పలు సూచనలు చేశారు. సభ్యులందరూ కేటాయించిన 15 నిమిషాల్లోగా ముగించాలని సభ్యులకు సూచించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఇదే విషయాన్ని ఊటంకించారు. నిర్ణీత గడువును పాటించి సహకరించాలని ప్రభుత్వ, విపక్ష సభ్యులకు సూచించారు.
దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ వెంటనే స్పందించారు. సభలో అధికారపక్షం నుంచి, విపక్షాల నుంచి కూడా ఈసారి ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కొత్త సభ్యులు ఉన్నారని, బడ్జెట్‌పై చర్చలో పాల్గొనాలని ఆసక్తి చూపుతున్నారని వివరించారు. ఒకేరోజున అనేక పద్దులపై చర్చ పెట్టడం తగదని, రాబోయే రోజుల్లోనైనా బడ్జెట్‌పై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు కేటాయించాలని కోరారు. రోజుకు రెండు అంశాలపై చర్చకు అవకాశముండేలా చూడాలని మంత్రిని, స్పీకర్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.