హైదరాబాద్, జనవరి 24 : రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సర (2022-23) బడ్జెట్ రూపకల్పన కోసం ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు లేఖ రాశారు. తెలంగాణ మున్సిపల్ చట్టంలో పేర్కొన్న విధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాలు, ఆర్థిక స్థితిగతులను ఆధ్యయనం చేసి వనరుల సమీకరణకు అనుసరించాల్సిన మార్గాలను కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి లక్ష్యంగా కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన ఉండాలని సూచించారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఫైనాన్స్ కమిషన్ నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణ ప్రగతి నిధులు అందుతాయని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణ, రుణాల చెల్లింపులు, కరెంటు చార్జీలు, 10% గ్రీన్ బడ్జెట్ నిధులను ఖర్చుగా చూపాలన్నారు. బడ్జెట్ కౌన్సిల్ సమావేశాలకు కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విధిగా హాజరు కావాలని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు.