మార్చి 28 (నమస్తే తెలంగాణ): ‘కీలకమైన బడ్జెట్ బుక్‌లు కాపీ పేస్ట్‌లా ఉన్నాయి. అవుట్ కమ్ బడ్జెట్ బుక్, ఈ ఏడాది గ్రాంట్స్ బుక్ రెండూ ఒకేలా ఉండటం ఏమిటి?’ అని మాజీ మత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. డిమాండ్ బుక్స్‌లో అవుట్ కమ్ బడ్జెట్ వివరాలు ముద్రించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. గతంలో సాధించిన ఫలితాలు, ఈ ఏడాది గ్రాంట్స్‌పై ప్రభుత్వానికి స్పష్టత లేదు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? నిలదీశారు.
అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అసలు మీరు సర్కార్‌ను నడుపుతున్నరా? లేక సరస్ నడిపిస్తున్నరా? అని ఘాటుగా ప్రశ్నించారు.
అత్యంత కీలకమైన బడ్జెట్ అంశంలో అధికారులు ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం గర్హనీయమని పేర్కొన్నారు. ‘ఆర్థికశాఖ మంత్రి తన సొంత ఆర్థిక కారణాలతో బిజీగా ఉన్నట్టు కనిపిస్తున్నది. అందుకే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. తక్షణమే ఈ తప్పును సరిదిద్దుకొని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ‘ఇది పొరపాటు కాదు నేరమే. సభలో ఇదే విషయంపై మాట్లాడుతా. ఉన్నది ఉన్నట్టు రెండు బుక్‌లు తయారు చేస్తే ఎలా ప్రభుత్వం నడుపుతున్నట్టు’ అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే ఈ తప్పుపై సభకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
