శేరిలింగంపల్లి, ఆగస్టు 17: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సిన అనివార్యత ఏర్పడితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్పారు. తాము యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి తీసుకొనిరావద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులవి గొంతెమ్మ కోరికలు కావని, తమకు వచ్చే హక్కులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరుతున్నామని వివరించారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఉచిత పథకాలకు వినియోగించడం వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే ఉచిత పథకాలు వాగ్దానం చేసే వారికి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేని వారికి కాకుండా, ఆర్థికంగా నిలబడ్డ నాయకుడికే ఓటేయ్యాలని, కులం, మతం సైతం చూడకుండా గెలిపించుకోవాలని కోరారు.
ఈ తరహా ఉద్యమానికి ఉద్యోగులు తెరలేపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన ఆదివారం 33వ రోజుకు చేరుకోగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఉద్యోగ సంఘాలు, నాయకులు ఆందోళనలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. గోపన్‌పల్లిలో సర్వే నంబర్ 36 ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులకు 18 ఎకరాలు ఉన్నట్టు కలలో ఎవరైనా చెప్పారా? అని అధికారులను ప్రశ్నించారు. గోపన్‌పల్లి భూముల విషయంపై జరుగుతున్న న్యాయపోరాటంలో మొదటి విజయం తమకే లభించిందని చెప్పారు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను సస్పెండ్ చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు స్థలాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. బీటీఎన్జీవోలు అధైర్యపడొద్దని, భూ ముల సాధించుకొనే వరకు టీఎన్జీవోస్ సంఘం జేఏసీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
మాది చేతకాని తనంకాదు: టీఎన్జీవోస్ అధ్యక్షుడు ముజీబ్ హుస్సేని
గోపన్‌పల్లి భూముల వ్యవహారంలో 33 రోజులుగా ఉద్యోగులు, రిటైడ్ ఉద్యోగులు నిరసన వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని టీఎన్జీవోస్ కేంద్రం సం ఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే సయ్యద్ ముజీబ్ హుస్సేని మండిపడ్డారు. హక్కుల సాధన కోసం తాము ఓపిక, సహనంతో ఉన్నామంటే అది తమ చేతగానితనం కాదని, ఉద్యమాలు తమకు కొత్త కాదని చెప్పారు.
స్థలాలిచ్చే దాకా కదలం: ముత్యాల సత్యనారాయణగౌడ్
ప్రభుత్వం జీవో ఇచ్చి తమకు స్థలాలు కేటాయించేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భాగ్యనగర్ టీఎన్జీవోస్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ స్పష్టంచేశారు. తాము గాంధేయ మార్గంలో శాంతియుతంగా పోరాడుతున్నామని, కోర్టుల్లో న్యాయ పోరాటం సైతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ భూముల విషయంలో కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టు తుది తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మిర్యాల నాగేందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌రావు, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సిరిసిల్ల కార్యదర్శి గాజుల సుదర్శన్, జగిత్యాల జిల్లా కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, టీఎన్జీవో కేంద్ర కమిటీ కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్, భాగ్యనగర్ టీఎన్జీవోస్ మ్యూచివల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసిం గ్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదాబేగం, సంధ్యారాణి, నర్సింహరాజు, ఏక్నాథ్గౌడ్ పాల్గొన్నారు.