హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం.. సీఎస్ఈ కోర్సుల్లో సీట్లను పెంచడం.. కొత్త బ్రాంచీలకు అనుమతులివ్వడంతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య పునర్వైభవాన్ని సంతరించుకుంటున్నది. ఆరేండ్లుగా బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లు (28,973) గణనీయంగా పెరుగుతున్నాయి. అడ్మిషన్లు ఐదేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 2019తో పొల్చితే 2024కు వచ్చేసరికి 38శాతం అడ్మిషన్లు పెరగడం విశే షం. 2019లో బీటెక్ అడ్మిషన్ల సంఖ్య 49 వేల లోపే.. కానిప్పుడు 75వేలు దాటింది. గతం లో 60శాతం కూడా నిండని పరిస్థితి ఉండే.. కానిప్పుడు 86శాతం సీట్లు నిండా యి. బీఆర్ఎస్ సర్కారు హయాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. దీంతో భారీ గా ఉద్యోగాల కల్పన జరగడంతో ఇంజినీరింగ్ కోర్సులు తిరిగి పుంజుకుంటున్నాయి.
పైగా ఇక్కడి కాలేజీల్లో ఎమర్జింగ్ కోర్సులు, ఉద్యోగావకాశాలున్న కోర్సులను ప్రవేశపెడుతున్నా రు. కేసీఆర్ సర్కారు హయాంలో నాలుగు జేఎన్టీయూ కాలేజీలను ఏర్పాటు చేసి, డ్యూ యల్ డిగ్రీ కోర్సులు, ఆనర్స్, మైనర్ కోర్సులను ప్రవేశ పెట్టారు. 70శాతం ఆఫ్‌లైన్, 30 శాతం ఆన్లైన్ కోర్సును చదువుకునే వెసులుబాటు కల్పించారు. 86,943 సీట్లల్లో 61వేల సీట్లు సీఎస్ఈ తత్సమాన కోర్సులకు సంబంధించినవే ఉన్నాయి. జాతీయంగా సీఎస్ఈ సీట్లల్లో 25శాతం మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో మాంద్యం ప్రభావమున్నా.. మన విద్యార్థులు మాత్రం ఐటీ కొలువులే లక్ష్యంగా బీటెక్ కోర్సుల్లోనే చేరుతున్నారు. కంపెనీలు ఏర్పాటవుతుండటం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ప్యాకేజీలతో ఇప్పుడు విద్యార్థులందరి దారి బీటెక్వైపే కనిపిస్తున్నది.