
హైదరాబాద్, నవంబర్19 (నమస్తే తెలంగాణ): పెట్టుబడుల ఉపసంహరణ పేరిట కేంద్ర ప్రభుత్వం మేలిమి రత్నాల్లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను, వాటి ఆస్తులను తెగనమ్మేస్తున్నది. లక్షల విలువైన ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నది. అందులో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో బీఎస్ఎన్ఎల్కు చెందిన కోట్లాది విలువైన భూమిని అమ్మేందుకు సిద్ధమైంది. 50 ఎకరాల భూమిలో 10 ఎకరాలను విక్రయించేందుకు గురువారం నుంచి బిడ్లను స్వీకరిస్తున్నది. మరోవైపు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నది. భావ్‌నగర్ జిల్లా (గుజరాత్) చిత్రాలో 5.59 ఎకరాలను, ఉత్తర 24 పరగణాల జిల్లా (పశ్చిమ బెంగాల్) మధ్యమ్‌గ్రామ్‌లో 11.16 ఎకరాలను, పటియాలా (పంజాబ్)లోని రాజ్‌పురాలో 20 ఎకరాలను విక్రయించేందుకు సిద్ధమైంది. దీనిపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.